Begin typing your search above and press return to search.

తమ్ముళ్లు కోరినట్లుగా ఆయన్ను మార్చే సాహసం బాబు చేస్తారా?

By:  Tupaki Desk   |   22 Sep 2020 9:30 AM GMT
తమ్ముళ్లు కోరినట్లుగా ఆయన్ను మార్చే సాహసం బాబు చేస్తారా?
X
ఓవైపు అధికారం పోవటం.. మరోవైపు తానెన్ని ప్రయత్నాలు చేసినా.. ఏపీలోని జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేయటంలో విఫలమైన చంద్రబాబు తీవ్రమైన అసహనంతో ఉన్నట్లు చెబుతారు. దీనికి తోడు.. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జంప్ అయిపోవటం ఆయనకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. పుట్టెడు కష్టాల్ని ఎదుర్కొంటున్న బాబుకు ఇప్పుడు మరో సమస్య మీద పడింది.

తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణను మార్చాలని టీటీడీపీ నేతలు పలువురు కోరుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తనకున్న పట్టును అంతో ఇంతో ప్రదర్శించింది. తర్వాతి కాలంలో ఆ పార్టీకి చెందిన నేతలంతా టీఆర్ఎస్ లోకి.. కొందరు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు.

2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టిన చంద్రబాబు.. దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. నందమూరి కుటుంబ సభ్యురాల్ని సైతం గెలిపించుకోలేకపోవటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. సదరు ఎన్నికల తర్వాత కాస్తో కూస్తో పేరున్న నేతలంతా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పటికైతే.. తెలంగాణలో టీడీపీ నామమాత్రంగా కూడా లేని దుస్థితి. ఇలాంటివేళ.. కాస్త పేరున్న బీసీ నేతగా ఉన్న ఎల్ రమణను మార్చాలని తెలుగు తమ్ముళ్లు అధినేతకు లేఖ రాయటం కలకలంగా మారింది.

ఇప్పటికిప్పుడు చూస్తే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి సరైన నేతలు ఎవరూ లేని పరిస్థితి. ఉన్న ఒక్క రమణను మార్చేస్తే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఏపీ రాజకీయాల మీదనే ఫోకస్ చేస్తున్న చంద్రబాబు.. తాజాగా తమ్ముళ్లు లేఖతో అయినా తెలంగాణ పార్టీ వ్యవహారాల మీద ఫోకస్ చేస్తారా? అన్నది ప్రశ్న. సాధారణంగా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు దాని సంగతి చూసే కన్నా.. దాన్ని అలా నానేలా చేయటం అలవాటు. ఇప్పుడున్న ప్రతికూల వాతావరణంలో తమ్ముళ్లు కోరినట్లుగా చేసే సాహసానికి బాబు తెర తీస్తారా? అన్నది సందేహమేనన్న మాట వినిపిస్తోంది