Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆంధ్రా క్వశ్చన్ పేపర్!

By:  Tupaki Desk   |   5 April 2017 7:38 AM GMT
తెలంగాణలో ఆంధ్రా క్వశ్చన్ పేపర్!
X
విడ్డూరానికే విడ్డూరంగా నిలుస్తున్న ఈ విష‌యాన్ని చూస్తే మ‌నం షాక్ తిన‌క త‌ప్ప‌దు. తెలుగు నేల మూడేళ్ల క్రిత‌మే రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ విష‌యాన్ని పాఠ‌శాల‌కెళ్లే విద్యార్థుల‌తో పాటు పండు ముదుస‌లి వ‌ర‌కు అంద‌రూ ఒప్పేసుకున్నారు. అయితే హైద‌ర‌బాదులో పిల్ల‌లకు విద్యాబుద్ధులు నేర్పేందుకు వెల‌సిన ఓ పాఠ‌శాల యాజ‌మాన్యం మాత్రం ఈ విష‌యాన్ని ఇప్ప‌టిదాకా గుర్తించిన‌ట్లుగా లేదు. ఎందుకంటే... తెలంగాణ ప్ర‌భుత్వం నిర్దేశించిన సిల‌బ‌స్ తో ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసిన త‌న విద్యార్థుల‌కు ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో భాగంగా ఆ పాఠ‌శాల పెద్ద షాకే ఇచ్చేసింది. తెలంగాణ బోర్డు అందించిన ప్ర‌శ్నాప‌త్రానికి బ‌దులుగా... ఏపీ ప్ర‌భుత్వం రూపొందించిన క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌ ను ఇచ్చేసింది.

రెండు రాష్ట్రాల సిల‌బ‌స్‌ లో 60 శాతం మేర ఒకే స్థాయి అంశాలున్నా.. మిగిలిన 40 శాతం మేర సిల‌బ‌స్‌ లో భారీ వ్యత్యాసాలే ఉన్నాయి. దీంతో ఆంధ్రా క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌ ను అందుకున్న తెలంగాణ విద్యార్థులు 57 మార్కుల‌కు స‌రిప‌డ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాశారు గానీ... త‌మ సిల‌బ‌స్‌ లో లేని 33 మార్కుల మేర ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు తెలియ‌క నోరెళ్ల‌బెట్టేశారు. విద్యార్థుల ఆందోళ‌న‌తో జ‌రిగిన పొర‌పాటును గుర్తించిన స‌ద‌రు పాఠ‌శాల యాజ‌మాన్యం... విద్యార్థుల త‌ల్లిదండ్రులు పాఠ‌శాల ముందు ఆందోళ‌న‌కు దిగే దాకా అస‌లు ఈ పొర‌పాటును అంత పెద్ద‌దిగా ప‌రిగ‌ణించ‌లేద‌ట‌.

ఇదంతా ఎక్క‌డ జ‌రిగింద‌టే... హైద‌రాబాదులోని యూసుఫ్ గూడ ప‌రిధిలో కార్య‌క‌లాపాలు సాగిస్తున్న విజ్ఞాన‌జ్యోతి పబ్లిక్ స్కూల్లోనే. ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో భాగంగా గ‌త నెల 13న జ‌రిగిన ప‌రీక్షకు హాజ‌రైన 24 మంది తెలంగాణ విద్యార్థుల‌కు ఆంధ్రా క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌ ను ఆ పాఠ‌శాల యాజ‌మాన్యం ఇచ్చింది. త‌మ సిల‌బ‌స్‌ కు చెందిన ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు రాసుకుంటూ వ‌చ్చిన విద్యార్థులు... త‌మ సిల‌బ‌స్‌ లో లేని ప్ర‌శ్న‌ల‌ను చూసి కంగు తిన్నారట‌. ఇదేంట‌ని ఇన్విజిలేట‌ర్‌ ను ప్ర‌శ్నిస్తే... విష‌యం కాస్తా ప్రిన్సిపాల్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా జ‌రిగిన పొర‌పాటు అప్పుడే వారికి అవ‌గ‌త‌మైంది.

అయినా కూడా దీనిని అంత పెద్ద‌గా ప‌ట్టించుకోని పాఠ‌శాల యాజ‌మాన్యం... బోర్డుకు ఓ లేఖ రాసి ప‌డేసి చేతులు దులిపేసుకుంది. ఈ విషయాన్ని కాస్తంత ఆల‌స్యంగా తెలుసుకున్న విద్యార్థుల త‌ల్లిదండ్రులు నిన్న‌ ఉద‌యం పాఠ‌శాల ముందు ఆందోళ‌న‌కు దిగారు. త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డితే బాధ్య‌త ఎవ‌రిదంటూ పాఠ‌శాల యాజ‌మాన్యాన్ని నిల‌దీశారు. అయినా కూడా అంత‌గా స్పందించ‌ని ప్రిన్సిపాల్‌... పొర‌పాటు జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని, ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే బోర్డు దృష్టికి తీసుకుని వెళ్లామ‌ని, విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగి తీరుతుంద‌ని చెప్పి... విష‌యాన్ని చాలా లైట్‌ గా కొట్టిపారేశారు.

ప్రిన్సిపాల్ హామీతో సంతృప్తి చెంద‌ని పేరెంట్స్ నేరుగా ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా దీనిపై అంత‌గా స్పందించిన దాఖ‌లా క‌నిపించ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ వ్య‌హారాన్ని స్కూల్ యాజ‌మాన్యం మాదిరే... పోలీసులు కూడా లైట్ తీసుకుని కేవ‌లం నెగ్లిజెన్స్ కిందే ఈ వ్య‌వ‌హ‌రాన్ని ప‌రిగ‌ణించాల్సి ఉంద‌ని చెప్పార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/