Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లో.. తెలంగాణ రాష్ట్ర లోగో.. పిక్ వైర‌ల్‌..!

By:  Tupaki Desk   |   27 Jan 2021 9:30 AM GMT
ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లో.. తెలంగాణ రాష్ట్ర లోగో.. పిక్ వైర‌ల్‌..!
X
సుప్రీం కోర్టు తీర్పుతో ఆంధ్రప్ర‌దేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో.. రాష్ట్రం ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో.. పంచాయతీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు కాబ‌ట్టి, ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను కోరుతోంది.

ఒక పంచాయ‌తీలో ఎన్నికలు జ‌రిగితే.. ప్ర‌భుత్వం ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. చేతి వేలికి రాసే ఇంక్ మొద‌లు.. ఎన్నిక‌ల‌ సిబ్బంది ఖ‌ర్చు, విద్యుత్ వ‌గైరా ఎన్నో ఖ‌ర్చులుంటాయి. అదే.. ఏక‌గ్రీవం జ‌రిగితే ఆ ఖ‌ర్చు మొత్తం మిగులుతుంది. అందుకే ప్ర‌భుత్వాలు ఏక‌గ్రీవాల‌ను ప్రోత్స‌హిస్తుంటాయి.

ఏపీ ప్ర‌భుత్వం కూడా ఈ ఏక‌గ్రీవాల‌ను ప్రోత్స‌హిస్తోంది. ఏక‌గ్రీవ పంచాయ‌తీల‌కు ప్రోత్సాహకాలను గతానికి క‌న్నా ఎక్కువ‌గా పెంచింది. 2 వేల లోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీ ఏకగ్రీవమైతే.. రూ.5 లక్షలు మంజూరు చేస్తుంది. 2 వేల నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయతీ ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు, పది వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు ఇస్తుంది. 10 వేల పైబడిన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్ర‌భుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేయడంతోపాటు పత్రికా ప్రకటన సైతం జారీ చేసింది.

అయితే.. ఈ ప్రకటన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ప‌త్రిక‌ల‌కు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లో తెలంగాణ గ్రామ పంచాయతీ భవనం ఫొటో వాడారు. సమాచార, పౌరసంబంధాల శాఖ ఈ యాడ్ ను స‌రిచూసుకోక‌పోవ‌డం వ‌ల్ల ఈ పొర‌పాటు దొర్లింది. ఈ విష‌యాన్ని ఎత్తిచూపుతూ విపక్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రకటన కోసం ఏపీలో ఒక్క పంచాయతీ భవనం కూడా మీకు దొరకలేదా..? అని ప్రశ్నిస్తున్నాయి.