Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ర్టాల్లో పోటీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన జ‌న‌సేన‌

By:  Tupaki Desk   |   3 Dec 2017 8:57 AM GMT
తెలుగు రాష్ర్టాల్లో పోటీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన జ‌న‌సేన‌
X
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ కార్యక‌లాపాల‌ను జెట్ స్పీడ్‌ తో ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్ప‌టికే జ‌న‌సైనికుల ఎంపిక‌, పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ‌వాల వారీగా బాధ్యుల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌ను వేగంగా చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో జనసేన పార్టీ సమన్వయకర్తల ఎంపిక కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జనసేన ఇన్‌ చార్జి శంకర్‌ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో రెండు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్ల నుంచి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలిపారు.

గ్రేట‌ర్ ప‌రిధిలోని పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల ఎంపిక కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా...దాదాపుగా 800 మంది కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్‌ - సికింద్రాబాద్‌ - మ‌ల్కాజ్ గిరీ పార్ల‌మెంట‌రీ స్థానాల‌కు ఈ ఎంపిక నిర్వ‌హించారు. అనంత‌రం తెలంగాణ జనసేన ఇన్‌ చార్జి శంకర్‌ గౌడ్ మాట్లాడుతూ జ‌నసేన పార్టీ కార్యాక్ర‌మాల‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌న్నారు. ఈ స‌మావేశ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. కార్య‌క‌ర్త‌లు ప‌లు అభిప్రాయాలు వెల్ల‌డించార‌ని పేర్కొంటూ వాటిని క్రోడీక‌రించి త‌మ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు వెళ్ల‌డిస్తామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు శంక‌ర్‌ గౌడ్‌ స్పందిస్తూ రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బ‌రిలో దిగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. రెండు రాష్ర్టాల్లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి త‌మ అభ్య‌ర్థులు పోటీలో ఉంటార‌ని వివ‌రించారు. వ‌చ్చే ఏడాదిలో త‌మ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీపై మ‌రింత దృష్టిసారిస్తార‌ని తెలిపారు. 2018లో పార్టీ త‌ర‌ఫున ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కాగా, 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయనున్న‌ట్లు జ‌న‌సేనాధిప‌తి ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు పార్టీ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌ను సైతం వేగ‌వంతం చేశారు. ఎన్నిక‌ల బ‌రిలో దిగే స‌మ‌యానికి పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే క్ర‌మంలో పార్టీ కార్య‌క‌ర్త‌లను స‌న్న‌ద్ధం చేస్తున్నారు. మ‌రోవైపు ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సైతం సంద‌ర్భానుసారం జ‌న‌సేనాని స్పందిస్తూనే ఉన్నారు.