టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం నారాయణఖేడ్ లో పర్యటిస్తున్నారు. తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన ఖేడ్ ను సస్యశ్యామలం చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల పథకాల శిలాఫలకాలు ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లాలో రూ.4,427 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాల ద్వారా 3.87 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు.
రానున్న రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు. ఇదే సమయంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో దేశ రాజకీయాల గురించి ప్రస్తావించారు. తద్వారా తన చూపు జాతీయ రాజకీయాలపై ఉన్నట్లు స్పష్టం చేశారు.
''బంగారు భారత్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలి. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు.
విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగు చేసుకుందాం'' అని సీఎం తెలిపారు. కాగా, ఈ సందర్భంగా బహిరంగ సభలో ఉద్యమ సమయంలో తాను నారాయణఖేడ్ వస్తే ఏం జరిగిందో వివరించారు.
''తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారు. ప్రజల్లో కూడా పెద్దగా ఆశ ఉండేది కాదు. కేసీఆర్ వస్తుండు.. పోతుండు.. తెలంగాణ వస్తదా.. రాదా.. అని అనేక సందేహాలు ఇక్కడి ప్రజల్లో ఉండేవి. వేరే పార్టీల వారు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసేవారు.
తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశా. ఉద్ధృతంగా ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం'' అని చెప్పి ఆకట్టుకున్నారు. అంతేకాక ''తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయని కొంత మంది చెప్పారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదన్నారు. రాష్ట్రంలో అంధకారం అలుముకుంటుందని అవాస్తవాలు ప్రచారం చేశారు. అప్పడు విమర్శలు చేసిన ఏపీలోనే ఇప్పుడు అంధకారం ఉంది.
తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఏడేళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి'' అని సీఎం కేసీఆర్ తెలిపారు. ''గతంలో నారాయణఖేడ్ చాలా వెనకబడి ఉండేది. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టారు. జహీరాబాద్‌లో చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉండేది.
ఈ ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు లబ్ధి చేకూరుతుంది'' అని సీఎం చెప్పారు.
జిల్లాలోని పంచాయతీలకు రూ.140 కోట్లు..''జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలకు నీరందాలి. ఏడాదిన్నరలోపు ప్రాజెక్టులు పూర్తి చేసేలా నేతలు కృషి చేయాలి. గజ్వేల్ కంటే ఎక్కువగా ఆందోల్‌కు నీళ్లు వస్తున్నాయి.
ఈ ప్రాజెక్టుల ద్వారా ఆందోల్‌కు 1.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశాం. మరోసారి సంగమేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తాను.
సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేస్తా. మిగతా 6 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తాం. అలాగే సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున రూ. 140 కోట్ల నిధులు మంజూరు చేస్తాం.
సంగారెడ్డి జిల్లాలో అన్ని తండాలకు రోడ్లు వేయిస్తాం. నిధులు విడుదల చేస్తూ రేపు జీవోలు జారీ చేస్తాం. పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రైతు బంధు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది. రైతులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం'' అని సీఎం పేర్కొన్నారు.