Begin typing your search above and press return to search.

ఆంధ్రా కోడి పందేల‌కు తెలంగాణ రెడీ!

By:  Tupaki Desk   |   20 Dec 2017 4:34 PM GMT
ఆంధ్రా కోడి పందేల‌కు తెలంగాణ రెడీ!
X
ఈ ఏడాది సంక్రాంతి సంబ‌రాలు ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. స‌హ‌జంగానే సంక్రాంతి అన‌గానే కోడిపందేలు గుర్తుకువ‌స్తాయి. గత ఏడాది పందేలను అడ్డుకోవడంలో భాగంగా పోలీసులు ముందస్తుగా దాడులు జరిపి పుంజులను స్వాధీనం చేసుకోవడం, కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు నమోదుచేయడం వంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి పుంజుల పెంపకందార్లు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సంక్రాంతి సంప్రదాయం ముసుగులో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో నిర్వహించే పందేలకు కోడిపుంజులు ప్రస్తుతం తెలంగాణలో గుట్టుచప్పుడు కాకుండా సిద్ధమవుతున్నాయి.

ప్రత్యేక శిక్షణతో పెంచే పందెం పుంజులకు సంక్రాంతి సమయంలో ఎక్కడలేని డిమాండ్‌ ఉంటుంది. దీనితో పుంజుల పెంపకాన్ని కొంతమంది ఓ వ్యాపకంగా చేపట్టేవారు. అయితే గత ఏడాది చేదు అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది చాలామంది పుంజుల పెంపకానికి దూరమయ్యారు. దీనితో పందేలు పాల్గొనే వారు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. గత ఆరు నెలలుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా పుంజులను పెంచుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రా సరిహద్దులకు సమీపంలోని తెలంగాణ ప్రాంతంలో గత ఆరు నెలలుగా పుంజుల పెంపకం చేపట్టారు. ఈ పుంజులను పందేలకు కొద్ది రోజుల ముందు నేరుగా బరులు ఏర్పాటుచేసే ప్రాంతాలకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు.

కాగా గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాల్లో పుంజుల పెంపకం చేపట్టారు. వీటిని పందాలు జరుగుతున్న సమయంలో నేరుగా ఆయా బరుల వద్దకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. రాష్ట్రంలో పుంజులను పెంచితే పోలీసులు దాడులు చేసి తీసుకెళ్ళిపోతున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతంగా ఎంచుకోవడంతో అక్కడి వాతావరణంలోనే వాటిని పెంచుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు పూర్తిచేసుకున్న తర్వాత వాటిని భీమవరం ప్రాంతానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కత్తులు లేకుండా డింకీ పందాలు వేసి వాటికి బరి వాతావరణాన్ని అలవాటు చేయనున్నట్లు సమాచారం.

గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో జరిగే కోడి పందాలకు ఇతర దేశాల నుండి సైతం అతిథులు హాజరవుతుంటారు. దీనితో కొందరు దూర ప్రాంతాల్లోని తమ స్నేహితులు - బంధువులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సంక్రాంతి పండుగకు భీమవరం రావడానికి ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే హోటళ్లలో గదులు కూడా బుక్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఏడాది భోగి నుంచి కనుమ పండుగ వరకు సంక్రాంతి కోడి పందాలు నిర్వహించేలా పందాలరాయుళ్ళు బరులు సిద్ధంచేసుకునే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోడి పందాలకు అనుమతిలేదని ప్రకటించినప్పటికీ, పందాల నిర్వాహకులు మాత్రం వారి ఏర్పాట్లలో వారున్నారు.

మ‌రోవైపు పెద్ద ఎత్తున‌ వ్యయప్రయాసల కోర్చి తెలంగాణ రాష్ట్రంలో పెంచుతున్న కొద్ది సంఖ్యలో ఉన్న పుంజులే ఈ ఏడాది పందాలకు అందుబాటులో ఉండే అవకాశముంది. దీనితో పుంజుల ధర చుక్కలను అంటుతోంది. ఇప్పటికే వాటి ధరలు రూ.50వేల వరకు పలుకుతున్నట్టు సమాచారం. ఇక పండుగ దగ్గర పడే కొద్దీ ధర మరింత పెరిగే అవకాశముంది. పందానికి తయారు చేసే ఒక్కో పుంజు ధర కనీసం రూ.లక్ష వరకు పలుకుతుందని అంచనా.