Begin typing your search above and press return to search.

స్టాంప్‌ పేప‌ర్‌ పై సంత‌కం పెట్టు..ఎమ్మెల్యే అభ్య‌ర్థికి షాక్‌

By:  Tupaki Desk   |   23 Nov 2018 1:20 PM GMT
స్టాంప్‌ పేప‌ర్‌ పై సంత‌కం పెట్టు..ఎమ్మెల్యే అభ్య‌ర్థికి షాక్‌
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనేక ప‌ద‌నిస‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపు ఓటముల సంగతేమోకానీ, ప్రచార దశలో - ఓటర్లు - అభ్యర్థులకు చుక్కలు చూపించేస్తున్నారు. ఓట్లు అడిగేందుకు వస్తున్న వారిని నిలదీయడమే కాదు.. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటూ హామీ పత్రాలు రాసివ్వమని నిలదీస్తున్నారు. జనగామ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇలాంటిదే విచిత్ర అనుభవం ఎదురైంది. ఏకంగా ఆ స‌భ నుంచి వెళ్లిపోయే ప‌రిస్థితి చోటుచేసుకుంది.

జనగామ జిల్లా నాగిరెడ్డి పల్లి గ్రామంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఓట్లు అడిగేందుకు గ్రామానికి వచ్చిన యాద‌గిరిరెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లేస్తామని తెగేసి చెప్పారు. చెరువు నిర్మాణం - నాగిరెడ్డిపల్లి-కొన్నె మధ్య బీటీ రోడ్డు నిర్మాణం - మార్కెట్‌ యార్డ్ నిర్మాణానికి భూమి విరాళం ఇస్తానంటూ హామీ పత్రం ఇవ్వాలని పట్టుబట్టారు. ఆమేరకు గ్రామస్తులే బాండ్‌ పేపర్‌ పై ప్రమాణాన్నీ సిద్ధం చేశారు. ఈ హామీలన్నింటినీ మూడు నెలల్లోపు నెరవేరుస్తామంటేనే ఓట్లేస్తామని కుండబద్దలు కొట్టారు. వారి కోర్కెలు తీర్చలేను అనుకున్నారో.. లేక వారివి గొంతెమ్మ కోర్కెలు అనుకున్నారో తెలియదు కానీ, ముత్తిరెడ్డి గారు - వారికి ఏ హామీ ఇవ్వకుండానే అక్కడినుంచి మెల్లగా జారుకున్నారు.