Begin typing your search above and press return to search.

ఆ జిల్లా నేత‌ల‌కు ఇంత ల‌క్కీనా... ప‌ద‌వులు అన్నీ వాళ్ల‌కే..!

By:  Tupaki Desk   |   28 Jan 2022 5:30 PM GMT
ఆ జిల్లా నేత‌ల‌కు ఇంత ల‌క్కీనా... ప‌ద‌వులు అన్నీ వాళ్ల‌కే..!
X
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అదృష్టం వ‌రించింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ అధ్య‌క్ష ప‌ద‌వులకు నియామ‌కాలు జ‌రిగాయి. ఇందులో భాగంగా నిర్మ‌ల్ జిల్లా టీఆర్ఎస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ముథోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి ఎంపిక‌య్యారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంలో భాగంగా జిల్లాల అధ్య‌క్షుల‌ను నియ‌మించింది. ఏకంగా తెలంగాణ‌లోని 33 జిల్లాల‌కు ఒకేసారి జాబితా విడుద‌ల చేసింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ కు జోగు రామ‌న్న‌.., ఆసిఫాబాద్ కు కోనేరు కోన‌ప్ప‌.., నిర్మ‌ల్ కు విఠ‌ల్ రెడ్డిని నియ‌మించింది.

సీనియ‌ర్ నేత‌లను నియ‌మించి ఉమ్మ‌డి జిల్లాకు స‌ముచిత గౌర‌వం ఇచ్చింది పార్టీ అధిష్ఠానం. అయితే.. నిర్మ‌ల్ జిల్లాకు అధ్య‌క్షుడిగా ముథోల్ ఎమ్మెల్యే ఎంపిక‌వ‌డంపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆనందంగా ఉన్నారు. అధ్య‌క్ష ప‌ద‌వుల‌కు ముథోల్ కార్ఖానాగా మారింద‌ని ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే ప్ర‌ధాన పార్టీల‌కు అధ్య‌క్షులుగా ఉన్న‌వారిది ముథోల్ కావ‌డం విశేషం. నిర్మ‌ల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ప‌వార్ రాంరావ్ ప‌టేల్ ది కూడా ముథోల్‌. అలాగే.. బీజేపీ జిల్లా అధ్య‌క్షురాలిగా ఉన్న ప‌డ‌కంటి ర‌మాదేవిది కూడా ముథోల్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక్క‌డ ఇంకో ఆస‌క్తిక‌ర విశేషం చెప్పుకోవాలి. ప్ర‌ధాన పార్టీల నుంచి అధ్య‌క్షులుగా ఉన్న వీరు ముగ్గ‌రూ.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ర‌స్ప‌రం పోటీలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముథోల్ స్థానానికి ఈ ముగ్గ‌రు పోటీ చేశారు. విఠ‌ల్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి.., రామారావు ప‌టేల్ కాంగ్రెస్ నుంచి.., ర‌మాదేవి బీజేపీ నుంచి బ‌రిలో నిలిచారు. ఈ ముక్కోణ‌పు పోటీలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థుల‌ను ఓడించి విఠ‌ల్ రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వీరు ముగ్గురే ఆయా పార్టీల నుంచి బ‌రిలో ఉండ‌బోతున్నారు. చూడాలి మ‌రి ఈసారి ఏ అధ్య‌క్షుల‌ను విజ‌యం వ‌రిస్తుందో..!