Begin typing your search above and press return to search.

పోతామ‌న్నోళ్ల‌ను.. ప‌ద‌వుల‌తో కొడుతున్నారు.. రిజ‌ల్ట్ వ‌చ్చేనా?!

By:  Tupaki Desk   |   6 July 2023 4:16 PM GMT
పోతామ‌న్నోళ్ల‌ను.. ప‌ద‌వుల‌తో కొడుతున్నారు.. రిజ‌ల్ట్ వ‌చ్చేనా?!
X
పోతార‌ని తెలిస్తే.. చాలు ప‌ద‌వులు పంచేస్తున్నారు. ఏదో ఒక ప‌ద‌వి.. దానికి ప్రాధాన్యం ఉందా లేదా.. అనే ది ప‌క్క‌న పెడితే మొత్తానికి పేరు ప‌క్క‌న ఒక డిసిగ్నేష‌న్ అయితే.. వ‌చ్చేస్తోంది. అయినంత మాత్రాన‌.. పా ర్టీ గాడిలో ప‌డుతుందా? నేత‌ల మ‌ధ్య అసంతృప్తులు త‌గ్గుతాయా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్న విష‌యం. తెలంగాణలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల‌నేది పార్టీ పెద్ద‌ల వ్యూహం.

ఇంత వ‌ర‌కుబాగానే ఉంది. కానీ.. ఈ వ్యూహానికి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు భారీగా గండికొట్టాయి. అక్క‌డ క‌నుక బీజేపీ గెలిచి, నిలిచి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది. తెలంగాణ‌లోనూ క‌మల వికాసంపై న‌మ్మ‌కం వ‌చ్చి ఉండేది. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీనే నాలుగు రోజులు బెంగ‌ళూరులో తిష్ట‌వేసినా.. ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించినా.. ఫ‌లితం సానుకూలంగా రాలేదు.

ఈ ఎఫెక్ట్ తెలంగాణ రాజ‌కీయాల‌పై ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు బీజేపీలో ఉన్న పొరుగు పార్టీ నాయ‌కులు(జంపింగులు) కోరుకుంటున్న‌ది అధికారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. తాము అధికారంలోకి రాక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అధికారంలోకి వ‌చ్చే పార్టీకే జై కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీని వీడేందుకు వారు రెడీ అయ్యారు. కానీ. ఎందుకో.. బీజేపీ వీరి విష‌యంలో వంద మెట్లు దిగివ‌చ్చింద‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలోనే అడిగిన వారికీ.. అడ‌గ‌ని వారికీ.. ముఖ్యంగా పోతామ‌న్నోళ్ల‌కు కూడా ప‌ద‌వులు పందేరం చేసింది. ఈ ప‌ద‌వుల‌కు ప‌వ‌ర్ ఉందా? లేదా..? అనేది ప‌క్క‌న పెడితే.. ఏదో ఒక స్థానం అయితే క‌ల్పించారు. కాబ‌ట్టి.. వెళ్లిపోవాల‌ని ప్లాన్ చేసుకున్న‌వారు కూడా.. పార్టీలోనే ఉండిపోతార‌ని క‌మ‌ల నాథులు లెక్క‌లు వేసుకున్నారు.

కానీ, ఎన్ని చేసినా.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ క‌నుక పుంజుకునే ప‌రిస్థితి లేక‌పోతే.. వీరు నిలిచే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చివ‌ర‌కు ఈ ప్ర‌యత్నాలు.. కేవ‌లం చెప్పుకొనేందుకు మాత్ర‌మే ప‌రిమితం అవుతాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.