Begin typing your search above and press return to search.

ఆ రహస్యం ఏదో చెప్పండి నేతలూ.?

By:  Tupaki Desk   |   22 Nov 2018 10:05 AM GMT
ఆ రహస్యం ఏదో చెప్పండి నేతలూ.?
X
రాజకీయాల్లో సంపాదించే నాయకుడు భర్తగా ఉండాలనే చాలా మంది భార్యలు కోరుకుంటారు. కానీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో మాత్రం భర్తల కంటే భార్యలే సంపాదన పరులుగా ఉన్నారు. అది భర్త సంపాదనో.. లేక ఆస్తులన్నీ వారి పేరు మీద ఉన్నాయో తెలియదు కానీ తెలంగాణ రాజకీయ నేతల భార్యలు మాత్రం ఇప్పుడు కోటీశ్వరరాలుగా కొనసాగుతున్నారు.

తాజాగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ ఆస్తిపాస్తుల మీద అఫిడవిట్ దాఖలు చేయాలని నిబంధన పెట్టడంతో అన్ని తెలిసిపోతున్నాయి. తెలంగాణలో వచ్చిన ముందస్తు ఎన్నికల సందర్భంగా నేతలు నామినేషన్లు వేస్తూ సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తిపాస్తుల వివరాలు పరిశీలిస్తే నేతల కంటే వారి భార్యలే ఎక్కువ సంపాదనపరులని తేటతెల్లం అవుతుంది.

ఆడళ్ల వయస్సు - మగవాడి సంపాదన అడుగొద్దంటారు.. కానీ ఇప్పుడున్న ఇన్ ఫర్మేషన్ యాక్ట్ పుణ్యమాని.. ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు మన నేతలు - వాళ్ల ఆడాళ్ల సంపాదన తెలిసిపోతున్నాయి. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నేతలు దాఖలు చేసిన అఫిడవిట్ పరిశీలిస్తే మన నేతల భార్యల సంపాదన మన నేతలనే తనదన్నేలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని పరిశీలించినట్లయితే..

మంత్రి కే.తారకరామారావు రూ.4.93కోట్ల ఆస్తిని కలగివుంటే ఆయన భార్య శైలిమాకు రూ.36.05 కోట్ల ఆస్తులున్నట్లు నామినేషన్లో దాఖలు చేశారు. అలాగే మంత్రి జగదీశ్ రెడ్డి ఆస్తి రూ.1.25కోట్లయితే ఆయన భార్య సునితకు రూ.2.27కోట్లు. మంత్రి ఈటల రాజేందర్ ఆస్తి విలువ రూ.12.82కోట్లు కాగా ఆయన భార్య జమునకు రూ.29.58కోట్లతో సూపర్ రిచ్ గా ఉన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే. జానారెడ్డికి రూ.3.32కోట్ల ఆస్తి ఉంటే ఆయన భార్య సుమతి ఆస్తి విలువ రూ.13.66కోట్లు. అయితే పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య విషయంలోనే కొంత తేడా కనిపిస్తుంది. ఆయన ఆస్తి విలువ రూ.2.08కోట్లు కాగా ఆయన భార్య పద్మావతి ఆస్తి రూ.98.20లక్షలు మాత్రమే. ఇక ఈ పరిస్థితి ఆంధ్రాలోనూ ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆస్తి రూ.2.99 కోట్లు కాగా ఆయన భార్య భువనేశ్వరీ ఆస్తి రూ. 53.37తో సంపాదనలో ఆయనకు అందనంత దూరానా ఉన్నారు.

భర్తలు రాజకీయాల్లోకి రాక ముందు వరకు వీళ్లంతా సాధారణ గృహుణులే. భర్త రాజకీయాల్లో రాణిస్తుంటే భార్యల సంపాదన అమాంతం పెరిగిపోతుంది. ఈ రహస్యాన్ని కూడా ఎన్నికల కమిషన్ అఫిడవిట్ లో పేర్కొనాలని కోరితే సాధారణ మగోళ్ల భార్యలు కూడా వాళ్లను ఫాలో అయి నాలుగు రాళ్లు సంపాదించుకుంటారు మరీ..