Begin typing your search above and press return to search.

డీజీపీ మహేందర్ సారును తెలంగాణ పోలీసులు అస్సలు మర్చిపోలేదు

By:  Tupaki Desk   |   9 Jun 2021 5:30 AM GMT
డీజీపీ మహేందర్ సారును తెలంగాణ పోలీసులు అస్సలు మర్చిపోలేదు
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వరం ఇవ్వటమే ఎక్కువ అనుకున్న వేళ.. అందుకు భిన్నంగా ఒకే ప్రకటనతో బోలెడన్ని వరాల్ని ప్రకటించటం ద్వారా పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. కానిస్టేబుల్ మొదలు ఐపీఎస్ ల వరకు ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో ఆయన తీసుకున్న వరుస నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర పోలీసులకు వరాల వర్షంగా చెప్పక తప్పదు. తెలంగాణ పోలీస్ బాస్ ప్రకటించిన వరాల్ని చూసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చప్పున గుర్తుకు రాక మానదు.

ఎవరైనా ఏదైనా అడిగితే.. కడుపు నిండుగా పెట్టాలనే సూత్రాన్ని డీజీ సాబ్ బాగానే వంట పట్టించుకున్నారని చెప్పాలి. తెలంగాణ పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించిన వరాల్ని చూస్తే.. చుట్టుపక్కల రాష్ట్రాల పోలీసుల వారు ఆసూయతో రగిలిపోవటం ఖాయం. ఇంతకూ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏమంటే..

- హౌసింగ్ రుణానికి చెల్లించాల్సిన వడ్డీని 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు

- ఇప్పటివరకు ఇంటి కొనుగోలుకు అర్హత ఐదేళ్ల సర్వీసును కాస్తా రెండేళ్లకు కుదింపు

- ఇల్లు కట్టుకోవటానికి ఏఎస్ ఐ స్థాయి వరకు రూ.35 లక్షలు.. ఎస్ఐ.. సీఐలకు రూ.45 లక్షలు.. డీఎస్పీ.. అదనపు ఎస్పీలకు రూ.55 లక్షలు.. నాన్ కేడర్ ఎస్పీ.. ఐపీఎస్ లకు రూ.65 లక్షల రుణ పరిమితి ఉండగా.. దాన్ని మరో రూ.5లక్షలు పెంపు.

- ప్లాట్ కొనుగోలు చేసేందుకు ఏఎస్ఐ స్థాయి వరకు రూ.20లక్షలు.. ఎస్ ఐ..సీఐలకు రూ.25 లక్షలు.. డీఎస్పీ అదనపు ఎస్పీలకు రూ.30 లక్షలు.. నాన్ కేరడ్ ఎస్పీ.. ఐపీఎస్ లకు రూ.40 లక్షల రుణ పరిమితిని ఇప్పుడు మరో రూ.5లక్షలు పెంచారు.

- పోలీస్ కుటుంబాల్లోని పిల్లలు విదేశీ విద్య కోసం రుణాల్ని భారీగా పెంపు. కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు రూ.15లక్షల్ని రూ.30 లక్షలకు..డీఎస్పీ నుంచి ఆపై స్థాయి అధికారులకు రూ.25లక్షల లిమిట్ ను రూ.30 లక్షలకు పెంచారు.

-అంతేకాదు.. విదేశీ విద్య రుణాల చెల్లింపు వ్యవధిని 120 నెలల నుంచి 180 నెలలకు పొడిగించారు.

కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయిలోని పోలీసులకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవటం.. అవన్నీ ఒకే సమావేశంలో కావటం చాలా అరుదుగా చెప్పక తప్పదు. ఒకసారి డబుల్ థమాకాగా మారిన ఈ నిర్ణయాలకు కారణమైన డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు ఎప్పటికి మర్చిపోలేరన్న మాట వినిపిస్తోంది.