Begin typing your search above and press return to search.

కాప్ క‌నెక్ట్‌..తెలంగాణ పోలీసుల ప్ర‌త్యేక యాప్!

By:  Tupaki Desk   |   11 May 2018 4:21 AM GMT
కాప్ క‌నెక్ట్‌..తెలంగాణ పోలీసుల ప్ర‌త్యేక యాప్!
X
అంది వ‌చ్చిన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకొని దూసుకెళ్ల‌టం తెలివైనోళ్లు చేసే ప‌ని. తాజాగా అలాంటి ప‌నే చేప‌ట్టింది తెలంగాణ పోలీసు యంత్రాంగం. ఏదైనా స‌మాచారాన్ని రాష్ట్రంలోని యావ‌త్ పోలీసు అధికారుల‌కు ఏక‌కాలంలో పంప‌టం క‌ష్టంతో కూడుకున్న ప‌ని. దాన్ని అధిగ‌మించేలా ఒక కొత్త సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేశారు.

ఒకేసారి ల‌క్ష మందికి సందేశాలు.. ఆడియో.. వీడియో సందేశాల్ని పంపేందుకు వీలుగా.. వాట్సాప్ ఫీచ‌ర్ల‌ను పోలి ఉండేలా స‌రికొత్త మొబైల్ అప్లికేష‌న్ ను సిద్ధం చేశారు. కాప్ క‌నెక్ట్ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ ను ప్ర‌స్తుతం టెస్ట్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీన్ని వాడుక‌లోకి తీసుకురానున్నారు.
దేశంలోనే తొలిసారిగా ఈ త‌ర‌హా సాంకేతిక‌త‌ను అందుబాటులోకి తెస్తున్న క్రెడిట్ తెలంగాణ పోలీసుల‌కు ద‌క్క‌నుంది. ఈ గ్రూపు ప్ర‌త్యేక‌త ఏమిటంటే..ఒకేసారి ల‌క్ష మందికి స‌మాచారాన్ని పంపే వెసులుబాటు ఉండ‌టం. ఇప్ప‌టివ‌ర‌కూ వాట్సాప్ గ్రూపుల మీద ఆధార‌ప‌డుతున్న పోలీసుల‌కు దానిలో ఉండే ప‌రిమితి ఇబ్బందిక‌రంగా మారింది.

ఏ గ్రూపులో అయినా 256 మందికి మించి స‌భ్యుల్ని గ్రూపులో పెట్టుకోవ‌టానికి వీల్లేక‌పోవ‌టంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు.. ఎవ‌రికి వారు చిన్న చిన్న గ్రూపుల్ని పెట్టుకుంటున్నారు. దీంతో.. స‌మాచారాన్ని ఒకేసారి పంప‌టం క‌ష్ట‌మ‌వుతోంది. ఈ ఇబ్బందిని అధిగ‌మించేందుకు వీలుగా కాప్ క‌నెక్ట్ యాప్ సాయం చేయ‌నుంది.

ఈ యాప్ రూప‌క‌ల్ప‌న‌కు తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు సాంకేతిక బృందం ఈ కొత్త యాప్ ను సిద్ధం చేసింది. ఇప్ప‌టికే దీన్ని స‌క్సెస్ ఫుల్ గా ప్ర‌యోగించి చూసిన‌ట్లు స‌మాచారం.

పోలీసులు మాత్ర‌మే ఉప‌యోగించే వీలున్న ఈ యాప్ కు కాప్ క‌నెక్ట్ అన్న పేరును డిసైడ్ చేశారు. పోలీసుల‌కు సంబంధించిన స‌మాచారం.. ఫోటోలు..వీడియోలు.. ఆడియోలు దీని ద్వారా షేర్ చేయ‌నున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 60వేల మంది పోలీసు యంత్రాంగాన్ని ఈ యాప్ లో భాగ‌స్వామ్యం చేస్తారు.

దీంతో.. సాధార‌ణ కానిస్టేబుల్ మొద‌లు డీజీపీ వ‌ర‌కూ అంతా ఒకే గ్రూపులో ఉండే వీలుంటుంది. దీంతో మ‌రింత మెరుగైన ప‌ని తీరుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఏదైనా స‌మాచారాన్ని అంద‌రికి సెక‌న్ల వ్య‌వ‌ధిలో పంపే వీలు ఉండ‌టంతో పాటు.. భ‌ద్ర‌తా ప‌ర‌మైన ఆదేశాల‌కు ఇది చాలా సులువు అవుతుంద‌ని భావిస్తున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ యాప్ లో షేర్ అయ్యే స‌మాచారాన్ని వేరే వారికి పంపే వీలు ఉండ‌ద‌ని చెబుతున్నారు. మిస్సింగ్ కేసులు.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల హ‌త్య లాంటి కీల‌క నేర ఉదంతాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని క్ష‌ణాల్లో రాష్ట్ర యంత్రాంగం మొత్తానికి తెలిసేందుకు వీలుగా ఈ యాప్ ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సీఎం కేసీఆర్ సూచ‌న‌తోనే ఈ యాప్ రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి చెబుతున్నారు.