Begin typing your search above and press return to search.

చెన్నైలో తమిళనాడు నేతను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

By:  Tupaki Desk   |   1 Sep 2021 7:30 AM GMT
చెన్నైలో తమిళనాడు నేతను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు
X
చెన్నైలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన తమిళనాడు నేత ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖ ఆసుపత్రిగా పేరున్నకామినేని ఆసుపత్రులకు రూ.300 కోట్లు రుణం ఇప్పిస్తానని చెప్పి.. అందుకు డాక్యుమెంట్ చార్జీల పేరుతో రూ.5 కోట్లను తమిళనాడుకు చెందిన నేత ఒకరు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా 2018లో జరిగింది. దీనికి సంబంధించిన తమకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ పోలీసులు చెన్నైకి వెళ్లారు.

శివగంగై జిల్లా కారైకుడికి చెందిన ఎస్సార్ దేవర్ అనే రాజకీయ నేతను అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు మూవేందర్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శిగా.. ఐదు జిల్లాల రైతు సంఘాల అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఐదుగురు పోలీసుల టీం తాజాగా దేవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను కారైకుడి నార్త్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పలు ప్రశ్నలు వేసిన అనంతరం.. ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.

మోసం చేసిన అభియోగంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేవర్ 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. నాటి పాలక అన్నాడీఎంకే కూటమి తరఫున తిరుచుళి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.