Begin typing your search above and press return to search.

అబ్బ‌.. ఏటా ఎన్నిక‌లుంటే బాగుండు.. కేసీఆర్‌ ఏం చేశారంటే!

By:  Tupaki Desk   |   24 March 2023 9:00 PM GMT
అబ్బ‌.. ఏటా ఎన్నిక‌లుంటే బాగుండు.. కేసీఆర్‌ ఏం చేశారంటే!
X
ఏటా ఎన్నిక‌లు ఉంటే బాగుండు బ్రో!! ఇదీ.. తెలంగాణ‌లో వినిపిస్తున్న మాట‌. ఎందుకంటే.. కేసీఆర్ వాయు వేగ మ‌నోవేగాల‌తో తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌జ‌లు ఫిదా అవుతూనే.. ఏటా ఎన్నిక‌లు ఉంటే.. అన్నినిర్ణ‌యా లు ఇలానే ఉంటాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకోవాలంటే.. ఆచితూ చి అడుగులు వేస్తాయి. ఇక‌, ఆర్థిక విష‌యాల‌కు సంబంధించినవి అయితే.. మ‌రింత ఆల‌స్యంగానే అడుగు లు ప‌డ‌తాయి. ఒక్కొక్క సారి అయితే.. స‌ద‌రు జీవోల కోసం ఉద్య‌మాలు చేసినా.. క‌రుణించే ప‌రిస్థితి ఉండ‌దు.

కానీ, ఎన్నిక‌ల సీజ‌న్ క‌దా.. వెన్వెంట‌నే జీవోలు వ‌స్తున్నాయి. ఖ‌మ్మంలో ప‌ర్య‌టించిన సీఎం కేసీఆర్ అక్క‌డి రైతుల‌కు రూ.10 చొప్పున పంట న‌ష్టం నిధులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఇది అయ్యేనా చ‌చ్చేనా.. అని అంద‌రూ అనుకున్నారు.

ప్ర‌తిప‌క్షాలు కూడా ఇవే వ్యాఖ్య‌లు చేశాయి. కానీ, కేసీఆర్ ఇంకా 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే.. ఈ న‌ష్ట‌ప‌రిహారానికి సంబంధించి ఏకంగా జీవో ఇచ్చేశారు. అంతేకాదు.. జీవో ఇచ్చిన ప‌ది గంట‌ల్లోనే రైతుల చేతుల్లో డ‌బ్బులు క‌నిపించాల‌ని.. తాను ఇంట్లో నుంచే చూస్తాన‌ని(టీవీల్లో) స్ప‌ష్టం చేశారు.

ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. ఎకరాకు రూ.10,000 ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా రైతులకు సాయం చేసేందుకు వీలుగా జీవో జారీ అయిపోయింది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనలకు లోబడి ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకోవాలని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చెల్లించాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలకు 17,238 ఎకరాల్లో నష్టం జరిగినట్టు తేల్చారు. ఈ మేరకు ఆయా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది.

కొస‌మెరుపు: ఏటా ఇలానే ఎన్నిక‌లు ఉంటే.. ప‌నులు ఎంతో వేగంగా అయిపోతాయ‌ని ప్ర‌జ‌లు వ్యాఖ్యానిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.