Begin typing your search above and press return to search.

జగన్ నిర్ణయంతో కేసీఆర్ పై ఒత్తిడి!

By:  Tupaki Desk   |   10 July 2020 1:30 PM GMT
జగన్ నిర్ణయంతో కేసీఆర్ పై ఒత్తిడి!
X
కరోనా కల్లోలంగా ఉంది.. తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతటి క్లిష్ట సమయంలో చురుకుగా స్పందించిన సీఎం జగన్ ఏ ముహూర్తాన కరోనా చికిత్సలన్నింటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాడో అప్పుడే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి మొదలైంది.

ఏపీ సీఎం జగన్ కరోనా చికిత్సలను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా చికిత్స చేసుకునేలా ఆరోగ్యశ్రీలో చేర్చడంపై ఏపీ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో తెలంగాణలో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ధనిక రాష్ట్రం అంటూ బీరాలు పలుకుతున్న కేసీఆర్ ఇంతటి కల్లోలం తెలంగాణలో జరుగుతున్న ఎందుకు ఇలా చేయడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.

తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ దీనిపై నిప్పులు చెరిగారు. విపత్తు వేళ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా.. కేసీఆర్ సెక్రటేరియట్ కూలుస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రాధాన్యం ఏంటో తెలుస్తోందంటూ మండిపడ్డారు.

ఇప్పటికే పలువురు హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో చికిత్స అందడం లేదని వీడియోల్లో మాట్లాడి చనిపోవడం కలకలం రేపింది. దీంతో తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీ పెట్టి వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో పెట్టాలనే డిమాండ్ ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

తాజాగా బీసీ సంఘాల నేతలు ఆరోగ్యశ్రీ పరిదిలోకి కరోనా చికిత్సలు చేర్చాలని మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఇదే డిమాండ్ చేయడం గమనార్హం.

ఇక బీజేపీ నేతలు మోడీ సర్కార్ ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి కరోనాను తెచ్చిందని..తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వల్ల చికిత్స అందడం లేదని విమర్శించింది. కనీసం ఆరోగ్యశ్రీలోనైనా చేర్చాలంటూ డిమాండ్ చేసింది.