Begin typing your search above and press return to search.

తెలంగాణ పేపర్ లీక్స్.. కంటిన్యూ

By:  Tupaki Desk   |   4 April 2023 3:11 PM GMT
తెలంగాణ పేపర్ లీక్స్.. కంటిన్యూ
X
తెలంగాణలో సదువులు సట్టబండలవుతున్నాయి. ఎంతో కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు కల్లలవుతున్న పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న టీఎస్ పీఎస్సీ ఏఈ ప్రశ్న పత్రం లీక్, గ్రూప్_1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం లీక్ ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకు షాకిచ్చాయి. అది మరిచిపోకముందే నిన్న ప్రారంభమైన పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్ కలకలం రేపుతోంది.

నిన్న పదోతరగతి తెలుగు పేపర్ లీక్ కాగా.. ఈరోజు హిందీ ప్రశ్నపత్రం కూడా లీక్ కావడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. మునుముందు ఇంకా ఎలాంటి లీకులు జరుగుతాయోనన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. టీఎస్పీఎస్సీ లీకులతో తమకు సంబంధం లేదన్న తెలంగాణ మంత్రులు ఇప్పుడు పదోతరగతి లీకులపై మాత్రం ఏం మాట్లాడడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ పరీక్షలకు ఏర్పాట్లు మొదలు, సవ్యంగా నిర్వహించేదాకా అనేక జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇన్విజిలేటర్లు, పరీక్షల అధికారులు పరీక్ష హాల్లోకి సెల్ ఫోన్ లను తీసుకెళ్లకూడదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు దర్జాగా మొబైల్ ఫోన్ లు దర్జాగా తీసుకెళ్లారు.

తాజాగా తెలంగాణలోని తాండూరులో వాట్సప్ లో ప్రశ్నపత్రాన్ని పంపడం నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉంది. ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ పట్టించుకున్న వారు లేరు. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలోని ఇలా జరుగుతుంటే.. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిన్న వికారాబాద్ తాండూర్ లో తెలుగు పేపర్ లీక్ కాగా.. నేడు తాజాగా వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు హిందీ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టినట్టు కొందరు చెబుతున్నారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

కాగా ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ గా స్పందించారు. పేపర్ లీక్ విచారణ జరిపి తాండూర్ లో ముగ్గురు అధికారులు సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ లను సస్పెండ్ చేశారు.

ఇక హిందీ పేపర్ లీక్ పై వరంగల్ సీపీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. విచారణ చేపడుతున్నామని.. ఇది లీకైనట్లు కాదని.. పరీక్ష మొదలయ్యాక గంటన్నర తర్వాత పేపర్ బయటకు వచ్చిందని వివరణ ఇచ్చారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.