Begin typing your search above and press return to search.

చైనా దొంగదెబ్బ ...తెలుగు ఆర్మీ అధికారి మృతి !

By:  Tupaki Desk   |   16 Jun 2020 2:36 PM GMT
చైనా దొంగదెబ్బ ...తెలుగు ఆర్మీ అధికారి మృతి !
X
భార‌త్ , చైనా స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ల‌ఢ‌ఖ్ ‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు ప‌ర‌స్ప‌రం ఘర్షణలకు పాల్పడ్డారు. వాస్త‌వాధీన రేఖ వెంట‌ దాదాపు నెల రోజుల పైగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో ప‌రిస్థితులను చ‌క్క‌దిద్దేందుకు ఆర్మీ ఉన్న‌తాధికారుల చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో సైనికుల మ‌ధ్య అనూహ్యంగా హింసాత్మ‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.సోమ‌వారం రాత్రి స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి ఇరు దేశాల సైనికులు రాళ్లు, ఇనుప రాడ్లు వంటి వాటితో కొట్లాట‌కు దిగారు.

ఈ ఘ‌ట‌న‌లో భార‌త్‌కు చెందిన ఒక క‌ల్న‌ల్, మ‌రో ఇద్ద‌రు సైనికులు అమ‌రుల‌య్యారు. భార‌త భూభాగంలోకి దూసుకొచ్చిన చైనా ఆర్మీ జ‌వాన్ల‌ను అడ్డుకున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం హోరాహోరీగా జ‌రిగిన దాడిలో చైనా ఆర్మీకి చెందిన న‌లుగురైదుగురు సైనికులు మ‌ర‌ణించినట్లు ఆ దేశ మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తోంది. అనేక సంద‌ర్భాల్లో చైనా – భార‌త్ స‌రిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఎదురుప‌డిన‌ప్పుడు ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ప్ప‌టికీ ఎప్పుడూ మ‌ర‌ణాలు సంభ‌వించిన సంద‌ర్భాలు లేవు.

ఈ ఘర్షణల్లో ఇద్దరు భారత జవాన్ల తో పాటు కల్నల్ ర్యాంక్ అధికారి బి సంతోష్ మృతిచెందారు. కల్నల్ సంతోష్ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా వాసి. సంతోష్ మరణంపై ఆర్మీ అధికారులు ఇప్పటికే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుద్ ఉన్నారు. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకు లో మేనేజర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలి పోవడం తో బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.