Begin typing your search above and press return to search.

ఆంధ్రాకి వెళితే తెలంగానం ఉండదా కవిత?

By:  Tupaki Desk   |   11 Feb 2017 6:19 AM GMT
ఆంధ్రాకి వెళితే తెలంగానం ఉండదా కవిత?
X
అందుకే చెప్పేది మాట చాలా ప్రమాకరమైనదని. మాటతో వచ్చే తిప్పలేమిటంటే.. అది ఉత్తనే ఉండదు. ఒకసారి ఒకరి నోటి నుంచి బయటకు వచ్చాక అది అందరి మనుల్లోకి వెళ్లిపోతుంది. అదే పనిగా ఆలోచించేలా చేస్తుంది. కొత్త కొత్తసందేహాలకు తావిస్తుంటుంది. అందుకే.. నోటి నుంచి వచ్చే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యమ సమయంలో చాలానే వాదనలు వినిపించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కమ్ ఎంపీ కవిత మాటల్ని చాలామంది ఇప్పటికి గుర్తు చేసుకుంటూ వస్తుంటారు. అయితే.. తాను చెప్పిన మాటల్నిఆమె మర్చిపోయినట్లున్నారు.

ప్రతి విషయానికి కొత్త తరహా వాదనను వినిపించి.. తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాల్ని పెంచిన ఆమె తెలంగాణరాష్ట్ర ఏర్పాటుతో ఇక అలాంటి అవసరం లేదని భావిస్తున్నట్లుగా కనిపిస్తుందన్న భావన కలగటం ఖాయం. తాజాగా ఆమె ఆంధ్రారాజధాని అమరావతి వెళ్లిన సందర్భంగా చేసిన ప్రసంగమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. తాను సభలోకి వస్తున్నప్పుడు గురజాడ అప్పారావు మాటలు గుర్తుకు వచ్చయన్న ఆమె.. తన ప్రసంగంలో భాగంగా దూబగుంట్ల రోశమ్మను గుర్తు చేసుకున్నారు.

ఇక్కడ పాయింట్ ఏమిటంటే.. కవిత తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించిన రెండు పేర్లు ఆంధ్రా ప్రాంతానికి చెందినవి కావటమే. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి విషయంలోనూ ఆంధ్రా.. తెలంగాణ అంటూ లెక్కలేసేవారు. చివరకు ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసిన విగ్రహాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందన్న వాదనను అప్పట్లో కేసీఆర్ వినిపించేవారు. అంతేనా?.. శతాబ్దాలకు సంబంధించిన కవుల ముచ్చటను తెర మీదకు తీసుకొచ్చి ప్రాంతీయ వాదనలు వారికి చుట్టేసి.. భావోద్వేగాల్ని పెంచేశారు.

తెలంగాణ యాసకు.. గోసకే తమ పట్టమంటూ గళం విప్పిన మాటల్ని విన్నప్పుడు.. నిజమే కదా? అని చాలామంది అనుకునే పరిస్థితి. తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ ను.. తెలంగాణ పూర్వీకుల్ని ఎంతగా ఫోకస్ చేయాలో అంతగా ఫోకస్ చేయొచ్చు. కానీ.. జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో మాట్లాడిన కవిత ఆ పని ఎందుకు చేయనట్లు? ఆంధ్రాప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖుల గురించి ప్రస్తావించిన కవిత..తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఎందుకు తలవలేదు? అంటే.. మహిళల కోసం తెలంగాణప్రాంతానికి చెందిన వారు లేరనా? తెలంగాణ మహిళా శక్తిని చాటి చెప్పే వారెవరూ లేరా? అన్నవి సందేహాలు.

ఇక్కడ చెప్పేదేమిటంటే.. కవిత తప్పు చేశారనో.. ఒప్పు చేశారనో కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో భావోద్వేగాల్ని పెంచేసిన వారు.. తమ చేతుల్లోకి అధికారం వచ్చిన వేళ.. గతంలో తాము చెప్పిన మాటల్ని ఎందుకు మర్చిపోతున్నారన్నదే పెద్ద ప్రశ్న. సమకాలీన అంశాలతోనూ.. ఉద్యమంతోనూ సంబంధం లేని వారిని సైతం ఉద్యమ సమయంలో ప్రస్తావించి.. వారిపై వ్యాఖ్యలు చేసినప్పుడు.. వారి మాటల్లో లోగుట్టును వెతికే ప్రయత్నం చేసినప్పుడు.. ఈ రోజు.. ఇప్పటి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న కవిత లాంటి వారు.. తెలంగాణ ప్రముఖల గురించి ఆంధ్రాగడ్డ మీద ఎందుకు మాట్లాడలేదన్నది ప్రశ్న. ఉద్యమ సమయంలో కవిత లాంటి వారి మాటల ప్రకారం చూసినప్పుడు.. ఒక పెద్ద సదస్సులో తెలంగాణ మహిళా శక్తి గళాన్ని వినిపించలేదంటే.. కవిత తెలంగాణను అవమానించినట్లు కాదా? ఆంధ్రా ప్రాంతానికి వెళితే తెలంగానం లేకపోవటం ఏమిటమ్మా కవితమ్మ?