Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ పోరుః కొన‌సాగుతున్న కౌంటింగ్‌.. అభ్య‌ర్థుల్లో తీవ్ర ఉత్కంఠ‌!

By:  Tupaki Desk   |   18 March 2021 4:51 AM GMT
ఎమ్మెల్సీ పోరుః కొన‌సాగుతున్న కౌంటింగ్‌.. అభ్య‌ర్థుల్లో తీవ్ర ఉత్కంఠ‌!
X
తెలంగాణ‌లోని రెండు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న‌(బుధ‌వారం) ఉద‌యం మొద‌లైన కౌంటింగ్ ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. ఓటింగ్ స్లిప్పుల‌ను బండిల్స్ గా క‌ట్టడానికే రాత్రి 9 గంట‌లు దాటింది. ఆ త‌ర్వాత లెక్కింపు మొద‌లు పెట్టారు. తెల్ల‌వారు జామున 3 గంట‌లకు న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన‌ తొలి ఫ‌లితం విడుద‌లైంది. హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మొద‌టి ఫ‌లితం ఉద‌యం 6 గంట‌ల‌కు వెల్ల‌డించారు.

న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఈ రెండు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. ఈయ‌న‌కు మొత్తం 15,857 ఓట్లు వ‌చ్చాయి. రెండో స్థానంలోకి అనూహ్యంగా స్వ‌తంత్ర అభ్య‌ర్థి‌ తీన్మార్ మ‌ల్ల‌న్న దూసుకొచ్చారు. ఆయ‌న‌కు 12,070 ఓట్లు పోల‌య్యాయి. టీజేఎస్ నేత‌ కోదండ‌రాం మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న బీజేపీ ఏకంగా నాలుగో స్థానంలో ఉంది. ఆ పార్టీ భ్య‌ర్థికి 6,669 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి 3,244 ఓట్ల‌తో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నారు. రెండో రౌండ్ పూర్త‌య్యే నాటికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా 7,871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో తొలి రౌండ్ పూర్త‌య్యే నాటికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవి ముందంజ‌లో ఉన్నారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి రాంచంద‌ర్ రావు స్వ‌ల్ప తేడాతోనే రెండో స్థానంలో కొన‌సాగుతున్నారు. టీఆర్ఎస్ ‌కు 17,429 ఓట్లు పోల‌వ్వ‌గా.. బీజేపీకి 16,385 ఓట్లు ప‌డ్డాయి. ఆ విధంగా వాణిదేవి 1,044 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఊహించ‌ని విధంగా ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయ‌న‌కు 8,357 ఓట్లు వ‌చ్చాయి.

మొత్తంగా చూస్తే.. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో 5,05,565 ఓట్లు ఉండ‌గా.. 3,86,320 ఓట్లు పోల‌య్యాయి. అంటే 76.41% మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇక్క‌డ 71 మంది బ‌రిలో నిలిచారు. ఇటు హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో 5,31,268 ఓట్ల‌కు గానూ.. 3,57,354 ఓట్లు పోల‌య్యాయి. 67.25 శాతం మంది ఓటు వేశారు.