Begin typing your search above and press return to search.

నిధుల కోసం బతిమాలుడుతున్న తెలంగాణ ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   29 Feb 2020 8:58 AM GMT
నిధుల కోసం బతిమాలుడుతున్న తెలంగాణ ఎమ్మెల్యేలు
X
తొలి టర్మ్ పూర్తి కాలం ఉండకుండానే ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితుల్లో అనేక హామీలు ఇచ్చి రెండోసారి గెలిచారు. అయితే వారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాదై దాటిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇచ్చిన హామీలకు నిధులు రాకపోవడంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాళ్లు నిధుల కోసం మంత్రులతో పాటు సీఎం కేసీఆర్ కు - ఆర్థిక మంత్రి హరీశ్ రావు - మంత్రి కేటీఆర్ కు విన్నవించుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు విన్నవించుకుంటున్నారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస ఎన్నికలు రావడంతో ఎన్నికలతోనే సంవత్సరం కాలం గడిచిపోయింది. ఆ పనుల్లో బిజీబిజీగా గడిపిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పనులను పట్టించుకోలేదు. దీంతో ఇచ్చిన హామీలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ సంవత్సరంలో కొత్త పనులు కూడా ఏమీ చెప్పట్లేదు. గత పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలన్నీ ముగిశాయి ఇక పనులపై ఫోకస్ పెడతామని అభివృద్ధి చేద్దామని చర్చించగా నిధులు లేవు. నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు మంత్రులను కోరుతున్నారు.

ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చుట్టూ తిరుగుతున్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే ప్రారంభమవుతుండడంతో తమ నియోజకవర్గాలకు నిధులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లు - తాగునీరు - డ్రైనేజీ - పారిశుద్ధ్యం తదితర సమస్యల పరిష్కారానికి నిధులు కోరుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏడాదికి రూ.3 కోట్ల నిధిని కేటాయించేవారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ నిధి ఎమ్మెల్యేలకు కేటాయించలేదు. దీంతో గ్రామాలకు వెళ్లినప్పుడు చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి కూడా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోలేకపోతున్నారు.

వరుసగా జరిగిన ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇవ్వగా ప్రస్తుతం నిధులు లేకపోవడంతో వాటిని పరిష్కరించలేక ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ విషయమై ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. దీంతో అప్పటికప్పుడు సర్దుబాటు చేసినా వాస్తవంగానే నిధులు లేకపోవడంతో వాటిని పరిష్కరించకపోవడంతో వెంటనే మంత్రుల వద్దకు వెళ్తున్నారు. బడ్జెట్ లో నియోజకవర్గాలకు నిధులు భారీగా కేటాయించాలని కోరుతూ ఆర్థిక మంత్రి హరీశ్ రావును కోరుతున్నారు.

హైదరాబాద్ లోని అరణ్య భవన్‌లో బడ్జెట్ కోసం మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు అరణ్యభవన్ కు వెళ్లి మంత్రిని కలిస్తున్నారు. పెండింగ్ పనుల జాబితాను వాటి అంచనాలు రూపొందించి మంత్రికి ఇస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలంతా ప్రగతి భవన్ కు వెళ్లి అక్కడ సీఎం కేసీఆర్ ను కూడా కలిసి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. ఇటీవల పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగితే ఓ ఎమ్మెల్యే గడ్డం పట్టుకుని మరి మంత్రి కేటీఆర్ ను కోరిన పరిస్థితి చూసే ఉన్నాం. దాదాపు తెలంగాణలో అందరూ ఎమ్మెల్యేలది అదే పరిస్థితి.