Begin typing your search above and press return to search.

నీటియుద్ధం: మంత్రుల మాటల తూటాలు

By:  Tupaki Desk   |   25 Jun 2021 4:11 PM GMT
నీటియుద్ధం: మంత్రుల మాటల తూటాలు
X
ఏపీ తెలంగాణ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నీటి కోసం మంత్రులు ఇప్పుడు పరుష పదాలతో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న పరిస్తితి నెలకొంది. మొన్నటికి మొన్న తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి 'లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులు' అని ఏపీ వాసులను అవమానించారు. దీనికి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. విద్వేషాలు రెచ్చగొట్టవద్దని.. కేసీఆర్, జగన్ చర్చలతో పరిష్కరించుకోవాలని.. తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా నీటి వివాదాలు తేల్చుకుందామని కోరారు.

అయితే తాజాగా తెలంగాణ మరో మంత్రి శ్రీనివాసగౌడ్ విరుచుకుపడ్డారు. చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ పై పడ్డారు. చనిపోయిన వారిని వదిలేయాల్సిందిపోయి తీవ్ర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కించారు. తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్ఆర్ ను దొంగ అనక ఏమంటారు? ఇప్పుడు జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు' అని శ్రీనివాసగౌడ్ ఫైర్ అయ్యారు. నీటి గొడవ, ఇతర అంశాలపై సయోధ్యతో ఉందామనుకుంటుంటే నోట్లో చక్కెర, కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉద్యమంలో ఉన్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఆయనది అని మంత్రి శ్రీనివాసగౌడ్ విరుచుకుపడ్డారు.

ఇక ఈ మాటలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నేతల వాదనలను ఖండించారు. తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమే అని చెప్పుకొచ్చారు. ఉద్వేగాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకు దమ్మిడి ఉపయోగం ఉందా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో చర్చలు జరపడానికి ఏపీ సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా ఎంతో మేలు చేశారని.. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రాజకీయ అవసరాల కోసమే వైఎస్ఆర్ ను విమర్శిస్తానని మంత్రి పేర్ని నాని విమర్శించారు.

ఇక ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సైతం తెలంగాణ మంత్రుల విమర్శలను ఖండించారు. రాజకీయాల కోసం సీమకు అన్యాయం చేయవద్దని.. ఏపీకి కేటాయించిన నీటినే సీమకు వాడుకుంటున్నామన్నారు.అయితే టీఆర్ఎస్ మంత్రులు ఇలా సడెన్ గా విమర్శల వెనుక హుజూరాబాద్ ఉప ఎన్నికలే కోసమే టీఆర్ఎస్ ఈ నీటి యుద్ధం మొదలుపెట్టిందని ఏపీ నేతలు అనుమానిస్తున్నారు. మరి ఈ కొట్లాట ఎటు దారితీస్తుందో చూడాలి మరీ.