Begin typing your search above and press return to search.

తుంగభద్రలో పుష్కర స్నానం.. టీ మంత్రులకు కరోనా పట్టదా?

By:  Tupaki Desk   |   21 Nov 2020 5:15 AM GMT
తుంగభద్రలో పుష్కర స్నానం.. టీ మంత్రులకు కరోనా పట్టదా?
X
అంటే అన్నామంటారు కానీ.. ఎంత అధికారంలో ఉంటే మాత్రం కరోనా వేళ.. కాసిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? శుక్రవారం నుంచి తుంగభద్ర పుష్కరాలు షురూ అయ్యాయి. సాధారణంగా పుష్కర స్నానాలు షురూ అయినంతనే రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్లి ఆరంభిస్తారు. ఏపీ విషయానికి వస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి.. స్టార్ట్ చేశారు. తెలంగాణ విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్ర దేవదాయా శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..ఇతర మంత్రులు శ్రీనివాస్ గౌడ్.. నిరంజన్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే అబ్రహం తదితరులు పుష్కర స్నానాన్ని ఆచరించారు. మామూలు రోజుల్లో అందరూ కలిసి నదిలోకి వెళ్లి స్నానం చేయటం పెద్ద విశేషం ఏమీ కాదు.

కరోనా వేళలో కాసింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పుష్కర స్నానాన్ని షవర్ కింద చేయాలన్న నిబంధనను కూడా తీసుకొచ్చారు. అందుకు భిన్నంగా మంత్రులు మాత్రం ఎంచక్కా నదిలోకి దిగి స్నానం చేశారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం స్నానాలు ఆచరించటం చూస్తే.. మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. ఇలా చేయటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తక మానదు. కీలక పదవుల్లో ఉండేవారు.. అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా తమకు తోచినట్లుగా వ్యవహరించటం సామాన్య ప్రజానీకాన్ని తప్పు దారిలో నడిచేలా చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మరింత చిత్రమైన విషయం ఏమంటే.. కరోనా వేళ భక్తులు నిబంధనలకు అనుగుణంగా పుష్కర స్నానాలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఓవైపు తాము తీసుకొచ్చిన నిబంధనలకు విరుద్ధంగా స్నానం చేసిన మంత్రి ఇంద్రకరణ్ అండ్ కో.. ప్రజల్ని మాత్రం రూల్స్ కు తగ్గట్లు స్నానం చేయాలని కోరటం ఏమిటన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. కరోనా వేళ కాసింత బాధ్యతగా వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.