Begin typing your search above and press return to search.

మంత్రులు - ఎమ్మెల్యేలే పాటించ‌లేదు..ఇక ప్ర‌జ‌లెంత‌?

By:  Tupaki Desk   |   22 May 2020 8:30 AM GMT
మంత్రులు - ఎమ్మెల్యేలే పాటించ‌లేదు..ఇక ప్ర‌జ‌లెంత‌?
X
భౌతిక‌ దూరం పాటించాలని - మాస్క్‌ లు ధ‌రించాల‌ని - శానిటైజ‌ర్ వినియోగించాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు చెబుతూనే ఉన్నారు. ఆ మ‌హ‌మ్మారిని త‌రిమికొడ‌దామ‌ని యుద్ధం చేసి చివ‌ర‌కు స‌ల్ల‌బ‌డి ఇప్పుడు దానితో స‌హ‌జీవ‌నం చేయాల్సిన ప‌రిస్థితి. ఇప్పుడు ఈ స్థితిలో మ‌రింత అప్రమత్తంగా ఉండాల్సిన ప‌రిస్థితి. అయితే ఎక్క‌డా జాగ్ర‌త్త‌లు పాటించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న మంత్రులు - ఎమ్మెల్యేల‌ను చూస్తుంటే తెలుస్తోంది. మంత్రులు - ఎమ్మెల్యే మందీమార్బలంతో అట్ట‌హాసంగా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. త‌క్కువ సంఖ్య‌లో జ‌నాలు ఉండాల‌ని ఉన్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా భౌతిక దూరం పాటించ‌డం లేదు. ఈ విధంగా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యే పై కేసు కూడా న‌మోదైన విష‌యం తెలిసిందే. వీళ్లే ఇష్టారాజ్యంగా ఉంటే ఇక సామాన్య ప్రజలు ఎంత అనే అభిప్రాయం ఏర్ప‌డుతోంది.

తెలంగాణ‌లో పెద్ద‌సంఖ్య‌లో మంత్రులు - ఎమ్మెల్యేలు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్నారు. జాగ్ర‌త్త‌లు పాటించ‌కుండానే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 25 డివిజన్లలో పేదలకు నిత్యావసర స‌రుకులు టీఆర్ ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా భౌతిక దూరం పాటించ‌క‌పోవ‌డం - జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ నాయ‌కుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు.

ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో సాధార‌ణ ప్ర‌జా జీవ‌నం మొద‌లైంది. ప్ర‌భుత్వం కూడా సాధార‌ణ ప‌రిపాల‌న‌పై ఫోక‌స్ పెట్టింది. ఈ క్ర‌మంలో అభివృద్ధి - సంక్షేమ కార్య‌క్ర‌మాలు వేగం పెంచారు. ఈ సంద‌ర్భంగా ఆయా కార్య‌క్ర‌మాల్లో మంత్రులు - ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ తాము ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతాల‌కు వెళ్తున్నారు. అక్క‌డ జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ నానా ‌హంగామా సృష్టిస్తున్నారు. ఈ స‌మ‌యంలో మ‌హ‌మ్మారి వైరస్‌ ను మ‌రిచిపోతున్నారు. కనీస జాగ్ర‌త్త‌లు పాటించ‌కుండా ఈ విధంగానే కార్య‌క్ర‌మాలు చేస్తుంటే అందులో ఎవ‌రో ఒక‌రికి వైర‌స్ సోకి ఉంటే ఇక వంద‌ల సంఖ్య‌లో కేసులు పెరిగే అవ‌కాశం ఉంది. ముందే అప్ర‌మ‌త్త‌మైతే మేలు. నాయ‌క మేలుకో ఇక‌.