Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రి సంచలన ఆరోపణ

By:  Tupaki Desk   |   30 March 2016 9:31 AM GMT
తెలంగాణ మంత్రి సంచలన ఆరోపణ
X
తెలంగాణ అసెంబ్లీలో మ‌రోమారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. త‌న‌ను చంద్ర‌బాబు కొట్టార‌ని తెలంగాణ మంత్రి నిండు స‌భ‌లో ప్ర‌స్తావించారు. అయితే ఆ ఉదంతం సమైక్యాంధ్ర‌ప్రదేశ్ నాటిద‌ని ఆయ‌న వివ‌రించారు. శాసనసభలో చర్చ సందర్భంగా నిజాం షుగర్ కంపెనీపై మంత్రి పోచారం, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా విపక్ష సభ్యుల ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ ఆనాటి సంఘ‌ట‌న‌ను ఉద‌హ‌రించారు.

చంద్ర‌బాబు హయాంలో నిజాం షుగర్ ప్రైవేటీకరణపై కమిటీని ఏర్పాటు చేసి ఆ క‌మిటీ నిర్ణ‌యమే ఫైనల్ అని తెలిపారు. తుది నిర్ణయం ప్ర‌క‌టించే ముందు అందరినీ పిలిచిన సంఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించారు. ''నిర్ణయం ప్రకటించే ముందు కూడా సార్.. మళ్లొకసారి ఆలోచించండి. ఇది మాతృ సంస్థ. దీని ద్వారా పది సంస్థలు పుట్టుకు వచ్చాయని చెప్పి చంద్ర‌బాబు కాళ్లా, వేళ్లా పడ్డా పట్టించుకోలేదు. పైగా ఆవేశంతో ఊగిపోయి నా తొడమీద కొట్టారు. ఎర్రగా కందిపోయింది. అయితే చంద్ర‌బాబు మాత్రం నిర్ణయం ప్రకటించి వెళ్లిపోయారు. నేను అక్కడే కూర్చున్నా" అంటూ గుర్తుచేసుకున్నారు.

అయితే కాసేపటి తర్వాత గన్‌మెన్‌ను పంపించి చంద్ర‌బాబు త‌న‌ను పిలిపించారని గుర్తుచేశారు. ఏదో ఆవేశంలో అలా చేశాను...దెబ్బ తగిలిందా అని అడిగార‌ని పోచారం తెలిపారు. దానికి పోచారం స్పందిస్తూ..."మీరు కొట్టిన దెబ్బ ఇక్కడ కాదు సార్.. నా గుండెమీద తగిలిందని చెప్పాను" అన్నారు. ఈ విషయాన్ని ఇదే మొదటిసారి బయటపెట్టడమని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ క్ర‌మంలో జోక్యం చేసుకొని చంద్రబాబు తనపై చేయి చేసుకున్నారని ఆరోపించిన మీరు...ఆయ‌న‌ కొట్టినప్పుడు మంత్రిగా ఎలా కొనసాగారని ప్రశ్నించారు. తెలంగాణకు రూపాయి ఇవ్వనన్న కిరణ్ కేబినెట్‌లో కాంగ్రెస్ నేతలు మంత్రులుగా కొనసాగలేదా అని పోచారం వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఇప్పుటి సీఎం కూడా కొట్టారని భవిష్యత్ లో చెప్తారా అని ఎద్దేవా చేశారు.