Begin typing your search above and press return to search.

వాళ్లు చుక్క‌లు చూపిస్తే...మేం చెక్కులు చూపిస్తున్నాం

By:  Tupaki Desk   |   9 May 2018 2:13 PM GMT
వాళ్లు చుక్క‌లు చూపిస్తే...మేం చెక్కులు చూపిస్తున్నాం
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు అవ‌కాశం దొర‌కాలే కానీ..త‌న మాట‌ల‌తో ఎదుటివారిని ఎలా ఫిదా చేస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేని సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భం వ‌స్తే చాలు గ‌త పాల‌కులు అంటూ కామెంట్ చేసే కేటీఆర్ తాజా మ‌రో కామెంట్ వేశారు. ఇంకా చెప్పాలంటే కౌంట‌ర్ వేశారు. గ‌త పాల‌న‌కు, త‌మ పాల‌న‌కు తేడా అంటూ పంచ్ వేశారు. గత ప్రభుత్వాలు రైతులకు చుక్కలు చూపితే.. తాము చెక్కులు చూపిస్తున్నాం అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై.. ఆ నేతలు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ చేరిక‌ల సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్ అనుమానాలు.. అవమానాల మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రయాణం మొదలైందని.. ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నామని... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్‌కు దిక్కులేదు.. నీళ్ల విషయంలో న్యాయం జరగలేదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముదిగొండలో.. టీడీపీ ప్రభుత్వం బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిందని విమర్శించారు. ``గత ప్రభుత్వాలు రాబందులైతే.. మనం రైతు బంధులం.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం.. ఎకరానికి 8 వేల రూపాయలు ఇచ్చే విప్లవాత్మకమైన పథకాన్ని రేపు ప్రారంభిస్తున్నాం.. దేశంలో మరో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్రం అవుతుందన్న నమ్మకం నాకు ఉంది`` అని కేటీఆర్ అన్నారు.

కాగా, తాజా చేరిక‌ల‌తో వరంగల్ పశ్చిమ నియోజవకర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ అన్నారు. నాలుగేళ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సమైక్య పాలనలో 6 గంటల కరెంట్ ఇవ్వడానికి ఆపసోపాలు పడ్డారు అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఆనాడు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఎరువులు, విత్తనాల కోసం గతంలో ఉన్న పరిస్థితులు లేవు. సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలోనే 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను నిర్మించుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.