Begin typing your search above and press return to search.

మజా మిస్ అయ్యిందని చెబుతున్నాడు

By:  Tupaki Desk   |   7 Oct 2015 4:16 AM GMT
మజా మిస్ అయ్యిందని చెబుతున్నాడు
X
కూరలో ఉప్పు మాత్రమే ఉంటే తినలేం. కారం మాత్రమే ఉన్నా తట్టుకోలేం. కానీ.. ఉప్పు.. కారం సమపాళ్లలో ఉంటే రుచి అదిరిపోతుంది. రాజకీయాల్లోనూ అంతే. అంతా అధికారపక్షమే ఉంటే ఎవరికి ఆసక్తి ఉండదు. విరుచుకుపడే విపక్షం.. దాన్ని తన తెలివితో కంట్రోల్ చేసే అధికారపక్షం ఉంటే ఆ మజానే వేరు. అధికార.. విపక్షాల మధ్య పోరాటం నిత్యం జరగాల్సిందే. ప్రజాస్వామ్యానికి అది తప్పనిసరి.

అధికారపక్షం చెప్పిన దానికి తలాడిస్తుంటే విపక్షం ఎందుకు? అధికారపక్షం తీసుకునే నిర్ణయాల్లో లోగుట్టును వివరించటం.. విరుచుకుపడటం లాంటివి విపక్షాలు చేయటం వాటి వృత్తి ధర్మం. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. తమ విధానాల్ని స్పష్టం చేస్తూ అధికారపక్షం ముందుకెళ్లాలి. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు అందుకు భిన్నంగా మారాయి.

రాష్ట్రంలో పెరిగిన రైతుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం.. రుణమాఫీని ఏకమొత్తంలో మాఫీ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది ఆచరణలో సాధ్యం కాదని తెలంగాణ అధికారపక్షం తేల్చి చెబితే.. ధనిక రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదంటూ నిలదీసిన పాపానికి మూకుమ్మడిగా విపక్షాలన్నింటి (మజ్లిస్ మినహా) పైనా సస్పెన్షన్ వేటు వేశారు. అది కూడా ఒకటి.. రెండు రోజులో కాకుండా అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకని తేల్చేయటంతో విపక్షాలు ఒక్కసారి విరుచుకుపడ్డాయి.

ఇదిలా ఉంటే మంగళవారం విపక్షాలు లేకుండా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అధికారపక్షం తాను చెప్పాలనుకున్నది చెప్పేయటం.. మధ్యలో అడ్డుకునే వారు కానీ.. సందేహాలు వ్యక్తం చేసే వారు కానీ.. విమర్శలు సంధించేవారు లేకపోవటంతో.. మంత్రులు తాము చెప్పాలన్నది టకటకా చెప్పేశారు. దీంతో.. చర్చించాల్సిన సబ్జెక్ట్ లు దాదాపుగా పూర్తి అయిపోయిన పరిస్థితి. అసెంబ్లీలో తనకు సంబంధించిన అంశాల్ని టకటకా చెప్పేసి బయటకు వచ్చేసిన మంత్రి కేటీఆర్ మాంచి ఉత్సాహంతో కనిపించారు.

ఈ సందర్భంగా ఆయన్ను కదిపిన మీడియా.. విపక్షాలు లేకుండా సభ ఎలా ఉందంటే.. విపక్షాలు ఉంటే మజా ఉండేదని చెప్పుకొచ్చారు. విపక్షాలు ఉంటే బాగుండేదన్న ఆయన.. వాటర్ గ్రిడ్ మీద నాన్ స్టాప్ వివరణ ఇచ్చినా పెద్దగా సంతృప్తి లేనట్లుగా మాట్లాడటం గమనార్హం. విపక్షాల వాదనల నడుమ.. సమర్థంగా తన వాదన వినిపిస్తే వచ్చే మజా.. అదేమీ లేకుండా ఉంటే ఎంత లోటు ఉంటుందో కేటీఆర్ కు ప్రాక్టికల్ గా అర్థమై ఉంటుంది.