Begin typing your search above and press return to search.

మాజీమంత్రిని అవమానించిన కేటీఆర్

By:  Tupaki Desk   |   3 March 2020 2:30 PM GMT
మాజీమంత్రిని అవమానించిన కేటీఆర్
X
అధికార పార్టీలో కేసీఆరే తర్వాత కేటీఆరే బాస్. ఇది కాదని ఎవరన్నా ముందుకు వెళ్తే ఇక వారికి చుక్కలే. పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్తే ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందేనని ఎన్నోసార్లు నిరూపితమైంది. దానికి కారేవరు అనర్హులని తెలిసిందే. గతంలో ఎంతోమంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు - పార్టీ నాయకులు దాని ప్రభావం ఎదుర్కొన్నవారే. ఆ విధంగా వ్యతిరేకించి కొందరు సల్లబడి పార్టీలో ఓ నాయకుడిగా కొనసాగుతుండగా.. మరికొందరు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి రాజకీయాల నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అలాంటి వారు తెర కనుమరుగయ్యారు.

తాజాగా ఓ మాజీమంత్రి అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మంత్రిగా పని చేశారు.. పాలమూరు జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న ఆయనను ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం దూరం పెడుతోంది.. అసలు ఆయనను గుర్తించడం లేదు. ఆయనే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన నియోజకవర్గం కొల్లాపూర్ లో ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో కూడా ఈ స్థానం నుంచి గెలుపొంది మంత్రిగా పని చేశారు. అయితే 2018 ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేయగా పరాభవం ఎదురైంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీరం హర్షవర్దన్ రెడ్డి గెలుపొంది జూపల్లిని ఓడించారు.

అయితే అనూహ్యంగా పరిణామాలు మారాయి. ఎమ్మెల్యేగా ఉన్న బీరం హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో జూపల్లి ప్రాధాన్యం తగ్గింది. మొదటి నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేలే నియోజకవర్గానికి బాస్ లని ప్రకటిస్తున్నాడు. ఆ మాదిరిగా వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న హర్షవర్దన్ రెడ్డికి ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో జూపల్లికి ఎలాంటి అవకాశాలు రావడం లేదు. ప్రాధాన్యం తగ్గడంతో పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

ఇటీవల మున్సిపల్ ఎన్నికలు రాగా అభ్యర్థుల ఎంపికను ఎమ్మెల్యేకే కేటాయించారు. దీంతో జూపల్లి వర్గానికి టికెట్లు లభించకపోవడం, గతం నుంచి పార్టీలో తన ప్రాధాన్యం తగ్గడంతో.. తన బలమేంటో చూపించాలని జూపల్లి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ అభ్యర్థులపై తన మద్దతుదారులను జూపల్లి నిలబెట్టారు. వారిని ఉపసంహరించుకోవాలని జూపల్లికి పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయినా జూపల్లి వినకుండా ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో జూపల్లి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా జూపల్లి మద్దతుదారులు గెలుపొందడంతో జూపల్లి బలం నిరూపించుకున్నారు. దీంతో తనకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపువస్తదని ఆశించగా అనూహ్యంగా ఇతరుల మద్దతుతో టీఆర్ఎస్ మున్సిపల్ ను కైవసం చేసుకుంది. కానీ జూపల్లి మద్దతుదారులను పార్టీలోకి చేర్చుకోలేదు. తాను టీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పినా పార్టీ పట్టించుకోవడం లేదు.

తన మద్దతుదారులైన కౌన్సిలర్లతో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు రాగా జూపల్లి కృష్ణారావు పరాభవం ఎదురైంది. కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అయితే తాజాగా డీసీసీబీ - డీసీఎంఎస్ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు గెలవడంతో వారిని తీసుకుని ప్రగతిభవన్ కు రాగా మళ్లీ జూపల్లి కృష్ణారావుకు అవమానం జరిగింది. కేటీఆర్ ను కలవడానికి వెళ్లితే ఆయన ముఖం తిప్పుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. తర్వాత మాట్లాడదాం అని జూపల్లిని పట్టించుకోకుండానే వెళ్లారని జూపల్లి అనుచరులు చెబుతున్నారు. ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న తనను పట్టించుకోకపోవడంపై జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ తీరుకు ఆయన రగిలిపోతున్నారు. ఈ పరిణామం ఎక్కడకు దారి తీస్తుందో వేచిచూడాలి.