Begin typing your search above and press return to search.

సీమాంధ్రులు బతుకు మీ పుణ్యమేనా?

By:  Tupaki Desk   |   15 Oct 2015 5:09 AM GMT
సీమాంధ్రులు బతుకు మీ పుణ్యమేనా?
X
ప్రేమ వస్తే కౌగిలించుకోవటం... కోపం వస్తే కిందకు తోసేయటం టీఆర్ఎస్ నేతలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ఇదొక్క విద్య మాత్రమే కాదు.. డెబిట్ ఏదైనా పక్కోళ్ల ఖాతాకు.. క్రెడిట్ ఏదైనా తమకు తామే తీసేసుకునే తత్వం టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి అలవాటేనన్న విషయం మరోసారి నిరూపించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన మాటలతో.

తాజాగా ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడిన కేటీఆర్.. ఇదంతా తమ పుణ్యమేనని మాట్లాడటం గమనార్హం. విజయవాడ.. గుంటూరు ప్రాంతాలు ఏపీ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న తీరుపై ఆయన తొలిసారి పెదవి విప్పారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందంటే అదంతా రాష్ట్ర విభజన పుణ్యమేనని.. తెలంగాణ రాష్ట్రం కానీ ఏర్పడకపోతే ఇంతటి అభివృద్ధే జరిగేది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఉమ్మడిగా ఉంటే.. అమరావతి రాజధానిగా మారేదా? అన్న ప్రశ్న వేశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రజలతో తమకు ఎలాంటి పంచాయితీ లేదన్న కేటీఆర్.. దేశ విదేశాల నుంచి వచ్చి అనేకమంది భాగ్యనగరిలో సెటిల్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేటీఆర్ తీరు చూస్తుంటే.. ప్రస్తుతం పుట్టెడు కష్టాల్లో ఉన్న సీమాంధ్ర ప్రజలు.. తమ సమస్యలు పరిష్కరించుకొని బాగు పడితే.. అది మొత్తం తమ క్రెడిట్ అని చెప్పుకున్నా చెప్పుకుంటారేమో.

సవాళ్లు ఎదుర్కొనే సత్తా తామే ఇచ్చామని.. తాము కానీ లేకపోతే.. సీమాంధ్రులు ఇంత బాగా బతికేవాళ్లు కాదన్న మాట చెప్పినా ఆశ్చర్యం లేదేమో.