Begin typing your search above and press return to search.

కార్పొరేట‌ర్ల క‌థ‌ల‌పై కేటీఆర్ క‌న్నెర్ర చేశాడుగా

By:  Tupaki Desk   |   28 Oct 2017 5:10 PM GMT
కార్పొరేట‌ర్ల క‌థ‌ల‌పై కేటీఆర్ క‌న్నెర్ర చేశాడుగా
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ త‌న‌లోని ఉగ్ర న‌ర‌సింహుడి రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. హైద‌రాబాద్‌ ను విశ్వ‌న‌గ‌రంగా రూపొందించాల‌ని తాము త‌ప‌న ప‌డుతుంటే పార్టీ ద్వితీయ శ్రేణి నేత‌లు ప‌రువు బ‌జారున ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్న తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏకంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించివేస్తాన‌ని హెచ్చరించారు. హైద‌రాబాద్‌ కు చెందిన టీఆర్ ఎస్ పార్టీకి చెందిన కార్పొరేట‌ర్ల‌తో స‌మావేశం అయిన సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఈ ఆగ్ర‌హ రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ భేటీలో నగర పరిధిలో ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు - సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కార్పోరేటర్లకు సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల వారీగా తెలిపిన సమస్యలను విన్న మంత్రి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు అదేశాలు జారీ చేశారు.

ఈ సంద‌ర్భంగా చైతన్యపురి కార్పొరేటర్ విఠ‌ల్ రెడ్డికి హెచ్చరికలు చేసిన‌ట్లు స‌మాచారం. ``చైతన్యపురి నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా? అధికారులు మీ డివిజన్ లో తిరగాలి అంటే.. నీ అనుమతి తీసుకోవాలా? ఎక్కువ చేస్తే..పార్టీ నుండి సస్పెండ్ చేస్తా`` అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. పార్టీకి కార్పొరేటర్లు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌తినిధులని పేర్కొంటూ ఇష్టం వచ్చినట్టు చేయటం పద్ధతి కాద‌ని హెచ్చ‌రించారు. వెంగళరావు నగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్‌ ను మంత్రి కేటీఆర్‌ మందలించారు. అందరు జాగ్రతగా పని చేయాల‌ని...అధికారులు ఇబ్బంది పెడితే త‌నకు చెప్పాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. అధికారుల వెంట పడి పని చేయించుకోవాలని సూచించిన‌ట్లు తెలుస్తున్న‌ది. సినిమాలో నటించావా.. అని హయత్ నగర్ కార్పొరేటర్ సామతిరుమల్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం.

జీహెచ్ ఎంసీ నుంచి ప్రజలు అద్భుతాలేమి, ఆశించడం లేదని వారి యొక్క కనీస అవసరాలను తీర్చితే సరిపోతుందన్న మంత్రి, ఆ దిశగా పనిచేద్దామన్నారు. నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అంశాలపైనే ప్రధానంగా తమ దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. కార్పోరేటర్లుగా ఎన్నికై ఇప్పటికే సంవత్సరన్నర దాటిందన్న మంత్రి, ఇకపై నిరంతరం ప్రజల్లో తిరగాలని కోరారు. ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వారి వేంట ఉంటే సరిపోతుందని, ప్రజల కష్టసుఖాలను పంచుకోవాలని కోరారు. ప్రజల అవసరాలను తీర్చేలా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. సర్కిళ్ల స్థాయిలో నిర్వహిస్తున్న ఉమ్మడి సమన్వయ సమావేశంలో ఇకపై కార్పోరేటర్లను కూడా భాగస్వాములను చేసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు ప్రస్తావించే సమస్యలపట్ల సాధ్యమైనంతవరకు సానుకూలంగా స్పందించాలని అధికారులను కోరారు. తమ డివిజన్లను అభివృద్ధి చేసుకునేందుకు కార్పోరేటర్లకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. తమ డివిజన్ లేదా వార్డులను అదర్శంగా తీర్చిదిద్దితే ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. పార్కులు, ఇతర ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టి, రెవెన్యూ అధికారుల సహాకారంతో కాపాడాలన్నారు. మరోపైపు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నడుచుకోవాలని కార్పొరేటర్లకు ఈ సందర్భంగా గుర్తు తెలిపారు.