Begin typing your search above and press return to search.

వామ్మో.. మరీ ఇంత లోతుల్లోకి వెళ్లారా హరీశ్?

By:  Tupaki Desk   |   2 Nov 2020 6:50 AM GMT
వామ్మో.. మరీ ఇంత లోతుల్లోకి వెళ్లారా హరీశ్?
X
ఎన్నికలు ఏవైనా కానీ.. టీఆర్ఎస్ ఎంత సీరియస్ గా తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి పోల్ మేనేజ్ మెంట్ అనే మాటను టీడీపీ అధినేత చంద్రబాబుకు తరచూ వాడుతుంటారు కానీ.. ఆయన కంటే ఘనుడు గులాబీ బాస్. ఆ మాటకు వస్తే.. ఉప ఎన్నికలతోనే తెలంగాణ మలి ఉద్యమాన్ని నడిపిన వైనం తెలిసిందే. రాజీనామాలు చేయటం.. ఉప ఎన్నికల వేళ.. సెంటిమెంట్ ను పీక్స్ కు తీసుకెళ్లటం అందరికి తెలిసిన చరిత్రే.

ఏ ఎన్నికకు ఎలాంటి ప్లానింగ్ అవసరమన్న విషయం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెబుతారు. తాజాగా దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించి మంత్రి హరీశ్ ఎంత లోతుల్లోకి వెళ్లారన్న విషయం తాజాగా ఆయన మాటల్ని చూస్తే ఇట్టే తెలుసుకోవచ్చు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రాసెస్ మొదలైన నాటి నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు చెందిన ఇళ్లు.బంధువుల ఇళ్లతో పాటు.. వాళ్ల వియ్యంకులు.. బావమరదులు.. ఇలా అందరి లెక్కలు బయటకువస్తున్నాయి.

ఇవి సరిపోవన్నట్లుగా తాజాగా రఘునందనరావు తండ్రికి సంబంధించి ఆసక్తికర అంశాల్ని మంత్రి హరీశ్ వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు తండ్రి భగవంతరావుకు అసరా ఫించను అందిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబం రైతుబంధు పథకం ద్వారా లబ్థి పొందుతున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథ నీరు.. రేషన్ బియ్యం.. ఉచిత విద్యుత్.. ఇలా ఐదు సంక్షేమ పథకాల ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశమే ఉంటే.. అసరా అందేదా? అని ప్రశ్నించారు.

మరీ.. ఇంత లోతుల్లోకి వెళ్లటమా హరీశ్ అన్నది ప్రశ్న. నిజంగానే అసరా ఫించన్ ను ఆపేస్తే.. ప్రబుత్వమే ఎక్కువ బద్నాం అవుతుంది. అయినా.. ఎన్నికల్లో పోటీ చేసే ప్రత్యర్థి ఇంట్లో ఎవరు ఎలాంటి సంక్షేమ పథకాలతో లబ్థి పొందుతున్నారు? లాంటి విషయాల్లోకి వెళ్లటమా? అన్నది ప్రశ్న. ఇదంతా చూస్తే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు సంబంధించిన వివరాల్నిసేకరించే విషయంలో హరీశ్ చాలానే లోతుల్లోకి వెళ్లినట్లుగా చెప్పక తప్పదు.