Begin typing your search above and press return to search.

పొద్దున్నే సైకిల్ ఎక్కి వీధుల్లోకి వచ్చిన తెలంగాణ మంత్రి

By:  Tupaki Desk   |   23 Dec 2019 6:33 AM GMT
పొద్దున్నే సైకిల్ ఎక్కి వీధుల్లోకి వచ్చిన తెలంగాణ మంత్రి
X
మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించటానికి ముందు అంచనాలు భారీగా ఉన్న పువ్వాడ అయజ్ కుమార్.. రవాణా శాఖామంత్రి అయ్యాక తనదైన మార్క్ ను ప్రదర్శించలేదన్న విమర్శ ఉంది. ఆర్టీసీ సమ్మె కాలంలోనూ ఆ శాఖా మంత్రిగా వ్యవహరిస్తూ కీలకభూమిక పోషించలేదన్న ఆరోపణ ఉంది. ఎంతసేపు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన మౌనంగా కూర్చోవటం మినహా ఆయనవరకూ చేసిందేమీ లేదన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉంది.

ఇంతకాలం మౌనంగా.. కాస్త అండర్ ప్లే చేసిన ఆయన ఇటీవల కాలంలో చురుకుగా వ్యవహరిస్తూ తరచూ వార్తల్లోకి వస్తున్నారు. పువ్వాడ అజయ్ లో తాజా మార్పు దేనికి సంకేతం అన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన పువ్వాడ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని తూచాగా తప్పకుండా ఫాలో అవుతున్నారన్న భావన కలిగించారని చెప్పాలి.

ఆర్టీసీ బస్సుల్లో మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ప్రయాణించాలని.. సేవల్ని మరింత మెరుగుపర్చాలని చెప్పటం తెలిసిందే. సీఎం నోటి నుంచి వచ్చిన మాటలకు మంత్రులు కానీ మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ స్పందించింది చాలా తక్కువనే చెప్పాలి. ఇలాంటివేళ.. మంత్రిగా వ్యవహరిస్తున్న పువ్వాడ అజయ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించటం ద్వారా తాను సీఎం మాటను ఫాలో అవుతున్న సంకేతాల్ని అందించారు.

ఇదిలా ఉంటే ఈ రోజు (సోమవారం) ఉదయాన్నే సైకిల్ ఎక్కి వీధుల్లోకి వచ్చారు పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున వణికించే చలిలో సైకిల్ ఎక్కిన ఆయన పలు ప్రాంతాల్ని పరిశీలించారు. చెత్త కనిపించిన ప్రాంతాల్లో ఆగి కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. పొద్దుపొద్దున్నే మంత్రిగారు సైకిల్ ఎక్కి వీధుల్లో తిరుగుతుంటే అధికారులు మాత్రం ఇంట్లో ఉండగలరా? ఉరుకులు పరుగులు పెడుతూ మంత్రిగారితో కలిసి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇదేదో ఒకట్రెండు రోజులుగా కాకుండా.. తరచూ చేస్తుంటే శానిటేషన్ సమస్య ఒక కొలిక్కి వచ్చే వీలుందని చెప్పాలి. మరి.. పువ్వాడ బాటలో మిగిలిన వారు ఫాలో అవుతారా?