Begin typing your search above and press return to search.

మహాకూటమి పొత్తు పొడవదా.?

By:  Tupaki Desk   |   6 Oct 2018 6:11 AM GMT
మహాకూటమి పొత్తు పొడవదా.?
X
ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్.. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్.. ఇలా తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎవరికి వారు ఎత్తులు వేస్తున్నారు. బలమైన టీఆర్ఎస్ ను ఓడించాలని ఏకంగా మహాకూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ ముందుకెళ్తోంది. కానీ ఇప్పుడు కూటమిలోని టీడీపీ, టీజేఎస్ ఇతర పక్షాలకు టికెట్ల సర్దుబాటు తెగడం లేదు. మహాకూటమి లీడ్ పార్టీ కాంగ్రెస్ 90 సీట్లకి తగ్గకూడదని తీసుకున్న నిర్ణయంతో కూటమి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

మహాకూటమిలో రెండో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం తమకు 20 స్థానాలకు తగ్గకుండా సీట్లు కావాలని కాంగ్రెస్ కు అల్టీమేటం జారీ చేసింది. కోదండరాం తెలంగాణ జనసమితి 10 సీట్లకు తక్కువ కాకుండా సీట్లు కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కోదండరాంకు కేవలం 3 సీట్లు మాత్రమే ఇస్తానంటోంది. ఇలా చేస్తే కూటమి నుంచి వైదొలుగుతామని కోదండరాం స్పష్టం చేస్తున్నారు. ఇక సీపీఐ పార్టీ తమకు పట్టున్న నల్గొండ, ఖమ్మం జిల్లాలతోపాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని సీట్లు కావాలని కోరుతోంది. కనీసం 10 స్థానాలు కావాలని పట్టుబడుతోంది.

ఈ లెక్క చూసుకుంటూ టీడీపీ 20, టీజేఎస్ 10, సీపీఐ10 సీట్లతోపాటు కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు కోరుతున్నాయి. కానీ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నవే మొత్తం 119 సీట్లు.. వీరు కోరుతున్న సీట్లను బట్టి చూస్తే మొత్తం 130 సీట్లు అవుతున్నాయి. తెలంగాణలో ఉన్న సీట్ల కంటే 11 స్థానాలు ఎక్కువ. దీంతో ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలో తెలియక కాంగ్రెస్ తల పట్టుకుంటోంది. బలమున్న తాము 90 సీట్లకు తక్కువ పోటీచేయమని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి పొత్తుల కోసం కలుస్తున్నా ఏకాభిప్రాయం కుదరడం లేదన్నది సమాచారం. ఇలా నాన్చుతూ పోతే రానున్న రోజుల్లో ఇక్కట్లు తప్పేలా లేవు. అసలు మహాకూటమి మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడుతోంది.