Begin typing your search above and press return to search.

చీఫ్ జస్టిస్ చెప్పాక.. గవర్నర్ కోరాక..

By:  Tupaki Desk   |   6 July 2016 4:33 AM GMT
చీఫ్ జస్టిస్ చెప్పాక.. గవర్నర్ కోరాక..
X
తెలంగాణ జడ్జిలు.. న్యాయవాదులు చేపట్టిన ఆందోళన ఒక కొలిక్కి వచ్చింది. తొమ్మిది రోజులుగా సాగుతున్న నిరసనను తెర దించుతూ నిర్ణయం తీసుకున్న జడ్జిలు.. లాయర్లు.. లీగల్ అధికారులు బుధవారం నుంచి తమ విధుల్లోకి హాజరు కావాలని నిర్ణయించారు. దీంతో.. నేటి నుంచి కోర్టుల్లో కార్యకలాపాలు యథాతథంగా జరగనున్నాయి. హైకోర్టు విభజన.. జడ్జిల ప్రాధమిక నియామకాల్లో తెలంగాణవారికి అన్యాయం జరుగుతుందంటూ జడ్జిలు రోడ్డెక్కటం తెలిసిందే. దేశ చరిత్రలో తొలిసారి దాదాపు 120 మంది జడ్జిల వరకూ నిరసన వ్యక్తం చేస్తూ.. తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కటం సంచలనం సృష్టించింది.

జడ్జిలకు సంఘీభావంగా తెలంగాణ లాయర్లు.. లీగల్ ఆఫీసర్లు.. ఇతర ఉద్యోగులు నిరసన బాట పట్టటంతో తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడి.. చివరకు కోర్టు తాళాలు తీసే వారు కూడా లేని పరిస్థితి చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. జడ్జిలు చేపట్టిన నిరసనలపై సీరియస్ అయిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. 11 మంది జడ్జిలు.. లీగల్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వేటును తీసివేయాలన్న డిమాండ్ ను తమ డిమాండ్ల లిస్ట్ లో చేర్చిన జడ్జిలు.. లాయర్లు.. లీగల్ ఆఫీసర్లు.. ఇతర ఉద్యోగులు నిరసనను మరింత ముమ్మరం చేయటంతో ఈ వ్యవహరం ఒక కొలిక్కి తీసుకురావటం కష్టంగా మారింది. అదే సమయంలో.. సమ్మెను నిలిపివేయాలన్న మాటను ఎవరూ పట్టించుకోని పరిస్థితి.

ఈ సమయంలో తెలంగాణ లాయర్ల జేఏసీ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసి.. సమ్మెకు కారణాలు తెలిపి.. తెలంగాణ జడ్జిలు.. లాయర్లకు జరుగుతున్న అన్యాయంతో పాటు.. హైకోర్టు విభజన అంశం ఆలస్యం కావటాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.సమస్యల పరిష్కార భారం తన మీద వేయాలని.. తక్షణమే సమ్మెను విరమించాలంటూ ఆయన సూచించారు. తాము మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటామంటూ ఆదివారం చెప్పిన లాయర్ల జేఏసీ తమ సమ్మెను కొనసాగించారు. అదే సమయంలో గవర్నర్ నరసింహన్ నుకలవటం.. ఆ తర్వాత ఆయన విడిగా లాయర్లతో ప్రత్యేక భేటీ నిర్వహించి.. సమస్యల పరిష్కారాన్ని తన మీద వదిలేసి.. ముందు సమ్మెను విరమించాలన్నారు.

దీంతో.. వేటు పడిన 11 మందిపై సస్పెన్షన్ ను ఎత్తి వేసే వరకూ సమ్మె కొనసాగిస్తామంటూ చేసిన ప్రకటనపై వెనక్కి తగ్గిన వారు.. సమ్మెను సమాప్తం చేయాలని నిర్ణయించారు. వేటు పడిన 11 మందిపై సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి స్పష్టమైన హామీ రానప్పటికీ.. సమ్మెను ముగిస్తే.. పరిస్థితులన్నీ ఒక కొలిక్కి రావటంతో పాటు.. హైకోర్టు విభజన వ్యవహారం పరిష్కార దిశగా అడుగులు పడతాయన్న మాటతో తమ సమ్మెను విరమించినట్లు చెబుతున్నారు. సమ్మెను ముగించే విషయంలో గవర్నర్ కీలకభూమిక పోషించినట్లుగా చెప్పొచ్చు.