Begin typing your search above and press return to search.

నెలాఖరు దాకా తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ ఇంకేమన్నారంటే?

By:  Tupaki Desk   |   22 March 2020 1:44 PM GMT
నెలాఖరు దాకా తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ ఇంకేమన్నారంటే?
X
కరోనా వైరస్ విస్తరణను నియంత్రించే క్రమంలో ప్రపంచ దేశాలతో పాటు ఆయా దేశాల్లోని రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు కీలక నిర్ణయా దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం (ఈ నెల 22) ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు దేశం యావత్తు సంపూర్ణ మద్దతు తెలిపిన వేళ... కరోనాను పూర్తిగా తరిమివేసేందుకు ఇదే తరహా స్వీయ నియంత్రణ చర్యలు తప్పవన్న భావనలో దేశంలోని పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సంచలన ప్రకటన చేశారు.

జనతా కర్ఫ్యూకు రాష్ట్ర ప్రజల స్పందన. కోవిడ్ విస్తృతిపై మీడియాతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం బయటకు వచ్చిన కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు. కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెలాఖరు దాకా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా ఎవరింటికి వారు పరిమితం కావాలని, ఇవాళ జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఐదుగురికి మించి గుమికూడవద్దని స్పష్టం చేశారు. ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.

అత్యవసర, నిత్యవసర స్తువుల కోసం కుటుంబానికి ఒక్కరిని మాత్రమే బయటికి అనుమతిస్తారని కేసీఆర్ వెల్లడించారు. ఎవరో చెప్పారన్నట్టుగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలన్న వివేకంతో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. రెక్కాడితే డొక్కాడని పేదల కోసం కొన్నిరోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని చెప్పారు. పప్పు, ఉప్పు, చింతపండు తదితరాల కోసం ఒక్కో తెల్లకార్డు దారుడికి రూ.1500 నగదు కూడా అందిస్తామని తెలిపారు. ఈ నెల 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరంలేదని, కొన్ని కీలక సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు తప్ప మిగిలిన ఉద్యోగులు ఇళ్లలోనే ఉండొచ్చని తెలిపారు.

వైద్య విభాగం, విద్యుత్ శాఖ తదితర అత్యవసర సర్వీసులు ఉద్యోగులు వంద శాతం కార్యాలయాలకు హాజరవ్వాలని, 20 శాతం రొటేషన్ పద్ధతిలో కార్యాలయాలకు హాజరవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఇక, విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏ కార్యక్రమం జరగదని, పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా నిలిపివేస్తున్నామని సీఎం చెప్పారు. మార్చి 31వ తేదీ తర్వాత సమీక్ష నిర్వహించి తదుపరి పరిణామాలపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భవన నిర్మాణ రంగ కార్మికులు, కాంట్రాక్టర్ల కింద పనిచేసే సిబ్బందికి విధిగా ఈ వారం రోజులకు సరిపడా వేతనాలు చెల్లించాలని స్పష్టం చేశారు. వారిని ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని చెప్పారు.