Begin typing your search above and press return to search.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి : కిషన్‌రెడ్డి

By:  Tupaki Desk   |   17 Sep 2020 8:50 AM GMT
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి : కిషన్‌రెడ్డి
X
నేడు తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఈ సందర్భంగా మరోమారు డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజును ఎందుకు ప్రభుత్వం అధికారికంగా జరపదని ప్రశ్నించారు. అనేక మంది ఉద్యమ కారుల త్యాగ ఫలితంతోనే తెలంగాణకు విముక్తి దొరికిందన్నారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నప్పుడు.. తెలంగాణ ఎందుకు ఆ పని చేయదని కిషన్‌రెడ్డి నిలదీశారు. స్వాతంత్య్ర చరిత్రను భావితరాలకు చెప్పాలన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ .. ఇప్పుడు ఆ విషయాన్ని అసలు ఎత్తడంలేదని అన్నారు.

ఆగస్టు 15న 1947న భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి లభించింది. అందుకే ఆ రోజున దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.. కానీ హైదరాబాదు ప్రజలు మాత్రం ఆ సంబరాల్లో పాలు పంచుకొనే అదృష్టం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాదు ఇండియాలోనూ, పాకిస్తాన్ లోనూ కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు.అయితే హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని ఆనాటి హోంశాఖ మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు.. అనేక పోరాటాల తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.