Begin typing your search above and press return to search.

ఏపిలో తెలంగాణ నేతల జోరు

By:  Tupaki Desk   |   3 Dec 2015 7:24 AM GMT
ఏపిలో తెలంగాణ నేతల జోరు
X
జాతీయ పార్టీగా మారిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలోని తన నాయకులకు న్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ను వేదిక చేసుకుంటోంది. తెలంగాణలో అధికారం లేకపోవడం.. పొరుగునే ఏపీలో అధికారంలో ఉండడంతో తెలంగాణ టీడీపీ నేతల్లో అసంతృప్తి రాకుండా చూసుకునేందుకు గాను ఏపీలో కొన్ని పదవులను తెలంగాణ నేతలకు ఇస్తున్నారు. కొందరు సీనియర్లకు - సమర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో బాబు చేపట్టిన ఈ సంప్రదాయం ఇప్పుడు కొత్త సమస్యను తెస్తోంది. గట్టిగా ఒత్తిడి చేస్తే మనకూ ఏదో ఒక పదవి ఏపీలో ఇస్తారన్న ఉద్దేశంతో విజయవాడలోని బాబు క్యాంపు ఆఫీసుకు టీటీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఇది ఇలాగే పెరిగితే ఏపీలో నేతల్లో అసంతృప్తి మొదలయ్యే ప్రమాదముంది. చంద్రబాబు ఈ పరిస్థితిని నివారించల్సిన అవసరం కనిపిస్తోంది.

తెలంగాణకు చెందిన ఇద్దరికి ఇప్పటికే ఏపీలో టిటిడి, మరో ఇద్దరికి కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఐపిఎస్ అధికారి రావులపాటి సీతారామరావుకు ఏపి పోలీసు కార్పొరేషన్ చైర్మన్ - తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఎల్వీఎస్ ఆర్‌ కె ప్రసాద్‌ కు ఏపి గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవులిచ్చారు. అంతకంటే ముందు పార్టీ ఎమ్మెల్యేలయిన సాయన్న - సండ్ర వెంకట వీరయ్యను టిటిడి సభ్యులుగా నియమించారు. తెలంగాణలో మరో కొన్నేళ్లు పార్టీ బతికి బట్టకట్టాలంటే, అక్కడి నాయకులకు ప్రాధాన్యం ఉన్న పదవులివ్వాలన్న ముందుచూపుతో బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యూహంతోనే ప్రస్తుతం తెలంగాణకు చెందిన పలువురు సీనియర్లకు - ఆంధ్రాలో కాంట్రాక్టులు కూడా ఇస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ నేతకు ఇసుక రీచ్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పదవులు, కాంట్రాక్టుల కోసం విజయవాడ క్యాంప్ ఆఫీసులో తెలంగాణ నేతలు చంద్రబాబును కలిసేందుకు పొద్దున్నే సిద్ధంగా ఉంటున్నారట. అక్కడ ఆంధ్రా నేతల కంటే తెలంగాణ నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్తున్నారు.

చంద్రబాబు పదవులిస్తుండడంతో హైదరాబాద్ - ఖమ్మం - నల్గొండ - నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో ఏపీ నుంచి వచ్చి సెటిలైన నేతలు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారట. తమ మూలాలు ఏపీలో ఉన్నాయని... తమకూ ఏదో ఒక పదవి ఏపీలో ఇవ్వాలని కోరుతున్నారట. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అడ్డంపెట్టుకుని భాగ్యనగరి నేతలూ చంద్రబాబుకు వినతిపత్రాలు ఇస్తున్నారని సమాచారం.