Begin typing your search above and press return to search.

ఆట మొదలైంది.. రియాక్షన్ షురూ అయ్యింది

By:  Tupaki Desk   |   11 Sept 2015 2:39 PM IST
ఆట మొదలైంది.. రియాక్షన్ షురూ అయ్యింది
X
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న నానుడిని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ ప్రత్యర్థి వర్గం. ఏ కోర్టును ఒప్పించి బెయిల్ షరతుల్ని మినహాయింపులు పొందారో.. సరిగ్గా దాంతోనే చెక్ చెప్పాలన్న ప్రయత్నం మొదలైంది.

ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ ను అరెస్ట్ చేయటం.. అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించటం.. ఇందులో భాగంగా ఆయన తన నియోజకవర్గమైన కొడంగల్ కు పరిమితం కావటం తెలిసిందే. అయితే.. తనకున్న ఇబ్బందుల్ని ఏకరువు పెట్టి.. హైకోర్టు నుంచి బెయిల్ షరతులకు మినహాయింపులు పొంది.. హైదరాబాద్ లో ఉండేలా రేవంత్ అనుమతి పొందారు.

ఈ సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేసి.. ఆట మొదలైంది.. వేట మొదలైందంటూ ఫ్లెక్సీలు కట్టి నానా హడావుడి చేయటం.. అందుకు తగ్గట్లే.. తన రాజకీయ ప్రత్యర్థులపైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి.. తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఆట మొదలైందన్న రేవంత్ రెడ్డి వర్గం మాటక ప్రతిగా.. రియాక్షన్ తాజాగా షురూ అయ్యింది.

కోర్టు ఇచ్చిన బెయిల్ ను దుర్వినియోగం చేసేలా.. అందులోని రూల్స్ ను రేవంత్ అతిక్రమించారని.. ఆయనకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీకి చెందిన న్యాయవాదులు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ స్టాండింగ్ కౌన్సిల్ కు వినతిపత్రం ఇచ్చారు. హైకోర్టు పేర్కొన్న విధంగా కాకుండా.. సెప్టెంబరు 9న రేవంత్ చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని.. తనపై పెట్టిన కేసుతో తననేమీ చేయకూడదన్నారని.. ఈ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ రద్దు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను అవమానించారంటూ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి.. తాజా ఫిర్యాదుపై ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో..?