Begin typing your search above and press return to search.

ప్రాంతాన్నే కాదు.. భాషనూ చీల్చేశారు!

By:  Tupaki Desk   |   7 Sep 2015 5:03 AM GMT
ప్రాంతాన్నే కాదు.. భాషనూ చీల్చేశారు!
X
తెలంగాణ ప్రభుత్వం మరో దుందుడుకు నిర్ణయం తీసుకున్నది. 'తెలంగాణ' అనేది ఒక ప్రత్యేకమైన భాష అన్నట్లుగా వేర్పాటు ధోరణితో వ్యవహరిస్తున్నది. ప్రాంతాలు సహజంగా వేరువేరు అయినప్పటికీ.. మనం మాట్లాడేదంతా తెలుగు భాష. భాష ఒక్కటి గనుకనే.. తెలంగాణ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలన్నీ కలిసి ఒక్కరాష్ట్రంగా ఏర్పడ్డాయి. అయితే, ప్రాంతాల అసమానత వల్ల తాము ఎక్కువగా నష్టపోతున్నాం అంటూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంతవాసులు పోరాడిసాధించుకున్నారు. అన్నదమ్ముల్లా విడిపోతున్నాం అనే ఇష్టం ఉన్నాలేకపోయినా అందరూ అనుకున్నారు. ఒకే భాష మాట్లాడే వారు కావడం వల్ల ఇలాంటి అభిప్రాయం ఏర్పడింది. రెండు తెలుగురాష్ట్రాలు అంటూ అందరూ వ్యవహరించడమూ జరుగుతోంది. రెండు ప్రాంతాల వారి మధ్య అనుబంధాన్ని సజీవంగా ఉంచగల ఒకే ఒక అంశం.. భాష మాత్రమే కాగా.. తాజాగా ఆ బంధాన్ని కూడా తెలంగాణ సర్కారు పుటుక్కున తుంచేసింది.

తెలంగాణ భాష అనేది ఒక ప్రత్యేకమైన భాష అన్నట్లుగా దానికి ఒక ప్రత్యేకమైన దినోత్సవాన్ని నిర్వహించడం వంటి వాటికి సర్కారు శ్రీకారం చుట్టింది. ప్రఖ్యాత తెలుగు కవి, తెలంగాణప్రాంతానికి చెందిన కాళోజీ జయంతి నాడు.. సెప్టెంబరు 9న ప్రతి ఏటా అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ భాష గురించి చర్చలు, గోష్టులు, వ్యాసరచన పోటీలు గట్రా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని, తెలంగాణ భాషా సాహిత్య వికాసానికి కృసిచేసిన వారికి పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రాంతం ఏదైనా కానీ భాష తెలుగే అన్న భావన ఇప్పటిదాకా మనందరిలో ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తెగ్గొడుతున్నారన్నమాట. తెలంగాణలోని మాండలీక సొగసును ఒక ప్రత్యేకమైన భాషగా పరిగణించడం అంటే.. తెలుగు భాషా ఔన్నత్యాన్ని కించపరచడమే అవుతుంది. ఇవాళ తెలంగాణ అనేది ప్రత్యేకమైన భాష అని ప్రకటించి పెడసరపు ధోరణి చూపిస్తున్న తెలంగాణ సర్కారు తమ భాషకోసం ఒక ప్రత్యేకమైన లిపిని కూడా సృష్టించుకుంటుందా? లేదా, తెలుగు అక్షరమాలలో ఉంటూ.. తెలంగాణ మాండలీకపు ప్రయోగాలలో ఎన్నడూ కనిపించని కొన్ని మహప్రాణాక్షరాలను పూర్తిగా భాషనుంచే తొలగించేసి.. చిన్నారుల పాఠ్య పుస్తకాలనుంచి తొలగించేస్తుందా అని కూడా అనుమానాలు కలుగుతున్నాయి. తెలుగు అక్షరమాలను కుదించి.. అదే తెలంగాణ అక్షరమాల అంటూ ఓ వితండవాదాన్ని లేవదీసినా ఆశ్చర్యం లేదని కొందరు సందేహిస్తున్నారు.