Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ స‌భ‌కు కోదండం మాష్టారి కేసుల షాక్‌!

By:  Tupaki Desk   |   27 Aug 2018 4:39 AM GMT
టీఆర్ ఎస్ స‌భ‌కు కోదండం మాష్టారి కేసుల షాక్‌!
X
టీఆర్ ఎస్ స‌ర్కారుపై సూటి విమ‌ర్శ‌ల‌తో ఉలిక్కిప‌డే స‌త్తా తెలంగాణ రాష్ట్రంలో ఎవ‌రికీ లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. ఆ లోటును తాను తీరుస్తానన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌రు టీజేఎస్ అధ్య‌క్షులు కోదండ‌రాం. ప్ర‌ధాని మోడీ సైతం టీఆర్ ఎస్ స‌ర్కారు అవినీతి ర‌హిత‌మ‌న్న కితాబులు ఇస్తున్న‌ట్లుగా కేసీఆర్ చెప్పుకుంటున్న వేళ‌.. అందుకు భిన్నంగా కోదండం మాష్టారు మాత్రం టీఆర్ఎస్ స‌ర్కారు తీవ్ర‌మైన అవినీతికి పాల్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌ను సంధిస్తున్నారు.

అంతేకాదు.. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ ను చంచ‌ల‌గూడ జైలుకు పంపుతామ‌న్న ఘాటు వ్యాఖ్య‌ను ఇటీవ‌ల చేశారు. మామూలుగా అయితే.. కోదండం మాష్టారు చేసిన ఈ వ్యాఖ్య మీడియాలో ప్ర‌ముఖంగా అచ్చు కావాల్సింది. కానీ.. తెలంగాణ‌లో ఇప్పుడున్న‌ ప‌రిస్థితుల్లో అలాంటి సాహ‌సాలు చేసే మీడియా సంస్థ‌లేవీ లేవ‌ని చెప్పాలి. దీంతో.. లోప‌లి పేజీల్లో సింగిల్ కాల‌మ్ కు కాస్త ఎక్కువ‌గా ఆ వార్త‌ను అచ్చేసి వ‌దిలేశారు.

ఇదిలా ఉంటే.. సెప్టెంబ‌రు 2న కొంగ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కోదండ‌రాం. ఈ స‌భ‌కు 25 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌కుండా జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల‌ని.. దేశ వ్యాప్తంగా ఈ స‌భ గురించి చ‌ర్చ జ‌ర‌గాల‌న్న అభిలాష‌ను వ్య‌క్తం చేశారు కేసీఆర్‌. టీఆర్ఎస్ అధినేత కోరుకున్న‌ట్లుగా భారీ స‌భ‌కు పాతిక ల‌క్ష‌ల మందిని తీసుకురావాలంటే ప్రైవేటు వాహ‌నాలు.. మ‌రి ముఖ్యంగా స్కూల్ బ‌స్సులు త‌ప్ప‌నిస‌రి.

అయితే.. పార్టీ కార్య‌క్ర‌మం కోసం స్కూల్ బ‌స్సుల్ని వినియోగిస్తే ఎట్టి ప‌రిస్థితుల్లో ఊరుకోమ‌ని చెబుతున్నారు కోదండ‌రాం. గ‌తంలో త‌మ పార్టీ కార్య‌క్ర‌మం కోసం స్కూల్ బ‌స్సుల్ని అడిగితే రూల్స్ చూపించి ఇవ్వ‌టం కుద‌ర‌ద‌ని చెప్పార‌ని.. అలాంట‌ప్పుడు టీఆర్ ఎస్ స‌భ కోసం స్కూల్ బ‌స్సుల‌కు అనుమ‌తి ఇస్తే ఊరుకునేది లేద‌న్నారు.

ఏ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్ప‌డితే తాము కేసులు వేస్తామ‌ని హెచ్చ‌రించిన కోదండం మాష్టారు.. స‌భ‌లు.. స‌మావేశాలు నిర్వ‌హించే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికి ఉంద‌న్నారు. అధికార దుర్వినియోగం జ‌ర‌గ‌కుండా గ‌వ‌ర్న‌ర్ చూడాల‌న్నారు. స‌భ కోసం ఉచితంగా ఆర్టీసీ బ‌స్సులు పంపుతాం.. డ‌యాస్ వేస్తాం.. ఆహారం అందిస్తాం లాంటి మాట‌లేమీ ఉండ‌కూడ‌ద‌ని.. అలా జ‌రిగితే ఊరుకోమ‌న్నారు. నాలుగున్న‌రేళ్ల కేసీఆర్ పాల‌న చూసిన త‌ర్వాత కూడా కోదండం మాష్టారికి త‌త్త్వం బోధ‌ప‌డ‌కుండా ఉంటే ఎలా? మాష్టారు వార్నింగ్ ఇచ్చిన వెంట‌నే ద‌డ‌ద‌డ‌లాడిపోవ‌టానికి అక్క‌డ ఉన్న‌ది ఉమ్మ‌డి రాష్ట్ర స‌ర్కారు కాదు.. టీఆర్ఎస్ స‌ర్కారు. మా స‌భ‌కు ఇవ్వ‌లేదు కాబ‌ట్టి.. మీ స‌భ‌కు రాకుండా చూస్తామ‌న్న మాట‌లు కేసీఆర్ జ‌మానాలో న‌డ‌వ‌న్న విష‌యం కోదండం మాష్టారికి ఎప్పుడు అర్థ‌మ‌వుతోందో?