Begin typing your search above and press return to search.

జేఏసీ నేత‌ల‌కు కాంగ్రెస్ కండువా...మ‌ర్మ‌మేంటో?

By:  Tupaki Desk   |   27 Jan 2018 5:35 PM GMT
జేఏసీ నేత‌ల‌కు కాంగ్రెస్ కండువా...మ‌ర్మ‌మేంటో?
X
తెలంగాణ రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా క‌లిసి ముందుకు సాగేందుకు ఇన్నాళ్లు క‌స‌ర‌త్తు చేసిన తెలంగాణ జేఏసీ - కాంగ్రెస్ మ‌ధ్య పొరాపొచ్చాలు బ‌హిర్గ‌తం అయిన‌ట్లుగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఏకంగా ఒక వేదిక నేత‌ల‌కు ఇంకొక‌రు త‌మ గూటికి చేర్చుకునేందుకు సిద్ధం కావ‌డం సంచ‌ల‌నంగా మారుతోంది. త‌మ ఉమ్మడి ప్ర‌త్య‌ర్థిగా సీఎం కేసీఆర్‌ ను భావించి క‌లిసిక‌ట్టుగా పోరాటం చేసేందుకు సిద్ధ‌మైన కాంగ్రెస్‌...తెలంగాణ జేఏసీ నేత‌ల‌ను త‌మ గూటికి చేర్చుకోవ‌డం క‌ల‌క‌లంగా మారింది. గాంధీభవన్‌ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో టీజాక్ నాయకుడు భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేటకు చెందిన భూపతిరెడ్డితో ఆయ‌న స‌న్నిహితులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న ప‌రిణామంతో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.

టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఎదుర్కునేందుకు ఆయ‌న ప్ర‌త్య‌ర్థులంతా ఏకం కావాల‌ని ఇందులోకి జేఏసీ కూడా చేరాల‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దే ప‌దే పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం సైతం తాము ప్ర‌భుత్వ వ్య‌తిరేక శ‌క్తుల‌తో క‌లిసి సాగుతామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే కొన్ని నిర‌స‌న కార్య‌క్ర‌మాలు సైతం జ‌రిగాయి. అయితే.. ఆ త‌ర్వాత ఇరువ‌ర్గాల‌కు గ్యాప్ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే..కాంగ్రెస్ పార్టీ త‌న బ‌లం పెంచుకునేందుకు జేఏసీ నేత‌ల‌కు గాలం వేస్తోంద‌ని చెప్తున్నారు.

కాగా, ఈ చేరిక సంద‌ర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పోలీసుల జులుం నడుస్తోంద‌ని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయని అందులో భాగ‌మే ఈ చేరిక‌ల‌ని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసి - తెలంగాణ యావత్తును దోచుకుంటున్నారని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ తన ఇంట్లో దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని...నేరేళ్లలో దళితులను - ఖమ్మంలో గిరిజనులను - మల్లన్న సాగర్ లో రైతులను అణచివేశారని ఉత్త‌మ్ విరుచుకుప‌డ్డారు. సీఎం నియోజకవర్గంలొనే ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. కేసీఆర్‌ కు అహంకారం ఎక్కువైంద‌ని ఆరోపిస్తూ...ఆయ‌న్ను గద్దె దించే రోజులు దగ్గరకు వచ్చాయని ఉత్తమ్ మండిప‌డ్డారు.కేసీఆర్ 500 కోట్లతో భవన్ కట్టుకొని విలాసలు చేస్తుంటే...కొడుకు సూటు బూటు వేసుకొని విదేశాలలో తిరుగుతున్నార‌ని...ఒక్క పైసా పెట్టుబడులు రాలేదని మండిప‌డ్డారు.