Begin typing your search above and press return to search.

పేరు చెప్పండి.. మీ వివ‌రాల‌న్ని చెప్పేస్తాన‌న్న ఐఏఎస్!

By:  Tupaki Desk   |   6 July 2019 6:15 AM GMT
పేరు చెప్పండి.. మీ వివ‌రాల‌న్ని చెప్పేస్తాన‌న్న ఐఏఎస్!
X
మీరెప్పుడు ఎక్క‌డ తిన్నారు? ఏ క్ష‌ణంలో ఎక్క‌డ ఉన్నార‌న్న స‌మాచారం ఇప్పుడున్న సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని తెలిసిపోయే ప‌రిస్థితి. స్మార్ట్ ఫోన్ లో సోష‌ల్ మీడియాను అదే ప‌నిగా వాడే వారంతా త‌మ‌కు సంబంధించిన స‌మాచారాన్ని తమ‌కు తెలీకుండానే ఇచ్చేస్తున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తెలంగాణ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి చేసిన ఒక వ్యాఖ్య పెను క‌ల‌క‌లాన్ని రేపుతోంది.

తాజాగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ నిర్వ‌హించిన స‌ద‌స్సుకు తెలంగాణ రాష్ట్ర ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అండ్ క‌మ్యునికేష‌న్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజన్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారింది.

రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడి చ‌రిత్ర త‌మ వ‌ద్ద ఉంద‌ని.... ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్సీతో కూడిన ప్ర‌త్యేక సాఫ్ట్ వేర్ తో తాము దాన్ని త‌యారు చేసిన‌ట్లుగా చెప్పారు. దీని కార‌ణంగా పౌరుల స‌మాచారాన్ని తాము 96.. 97 శాతం క‌చ్ఛితత్వంతో తెలుసుకోగ‌ల‌మంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

పేరు.. తండ్రి లేదంటే భ‌ర్త పేరు.. చిరునామ.. ఈ మూడింటి స‌మాచారంతో ఎవ‌రి వివ‌రాలైనా ఇట్టే తెలుసుకునేలా ప్ర‌త్యేక అల్గారిథ‌మ్ త‌యారు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. దీని ఆధారంగా తెలంగాణ‌లోని ప్ర‌తి పౌరుడి డిజిట‌ల్ ఫుట్ ప్రింట్ క్ష‌ణాల్లో తెలుసుకునే వీలుంద‌న్నారు. ఈ స‌మాచారంతోప్ర‌భుత్వం అమ‌లు చేసే ప‌థ‌కాల‌కు సంబంధించి ల‌బ్థిదారుల ఎంపికకు వీలు క‌లుగుతుంద‌న్నారు. డిజిట‌ల్ ఫుట్ ప్రింట్ పై జ‌యేశ్ రంజ‌న్ వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారం మీద ఇప్ప‌టికే ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఇలాంటివేళ‌.. మీ పేరు చెప్పండి.. నిమిషాల్లో మీ బ‌తుకు క‌థేమిటో చెప్పేస్తాన‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఆ వివ‌రాల‌న్ని త‌న‌కెంతగా అందుబాటులో ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్పేశార‌ని చెప్పాలి. స‌మాచార భ‌ద్ర‌త‌.. చౌర్యం మీద పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్న వేళ‌.. ఒక సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌న్న మాట వినిపిస్తోంది.

ఆధార్ ద్వారా సేక‌రించిన వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో దుర్వినియోగం చేయకూడ‌ద‌న్న మాటే కాదు.. ఇదే విష‌యంపై సుప్రీంకోర్టు త‌మ తీర్పుల్లో కేంద్ర‌. .రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అదే ప‌నిగా హెచ్చ‌రించ‌టం తెలిసిందే. ఇంతగా జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌ర్వాత కూడా జ‌యేశ్ రంజ‌న్ లాంటోళ్లు మీ పేరు చెబితే మీ వివ‌రాలు చెప్పేస్తానంటూ బ‌హిరంగంగా చెప్ప‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఒక సీనియ‌ర్ ఐఏఎస్ అధికారే అంత నిర్ల‌క్ష్యంగా ఉంటే.. మిగిలిన వారి ప‌రిస్థితి ఏమిట‌న్న దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.