Begin typing your search above and press return to search.

వివాదం ముగియ‌కుండానే... అడ్మిష‌న్లా?

By:  Tupaki Desk   |   11 May 2019 3:57 AM GMT
వివాదం ముగియ‌కుండానే... అడ్మిష‌న్లా?
X
తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు తీరేమీ మార‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. బోర్డు తీరే ఇలా ఉంటే... బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్ తీరు మాత్రం మ‌రింత స్పీడుగా ఉంద‌నే చెప్పాలి. ఈ ఏడాది ప‌రీక్ష‌ల ఫ‌లితాల వెల్ల‌డిలోనే పెద్ద ఎత్తున అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగి.. 23 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌నపై నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా పూర్తిగా చ‌ల్లార‌లేద‌నే చెప్పాలి. అయితే ఈ విష‌యాన్ని చాలా లైట్ గానే తీసుకున్న ఇంట‌ర్ బోర్డు... ఏకంగా వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేయ‌డంతో పాటుగా అడ్మిష‌న్ల‌కు కూడా ప్ర‌క‌ట‌న వెలువ‌రించేసింది.

ఓ వైపు ఇంట‌ర్ బోర్డు నిర్ల‌క్ష్యంపై ఇప్ప‌టిదాకా చ‌ర్య‌లే తీసుకోలేదు. అప్పుడే వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన షెడ్యూల్ ను విడుద‌ల చేయ‌డం, అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌కు కూడా బోర్డు ద్వారానే ప్ర‌క‌ట‌న ఇప్పించ‌డం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. ఇంట‌ర్ ఫ‌లితాల్లో త‌ప్పుల‌కు ప్ర‌ధాన కార‌ణంగా భావిస్తున్న గ్లోబ‌రీనా సంస్థ‌, ఇంట‌ర్ బోర్డుల‌పై ఇప్ప‌టిదాకా చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లానే లేదు. అంతేకాకుండా ఈ రెండు సంస్థ‌ల నిర్లక్ష్యం కార‌ణంగా జ‌రిగిన త‌ప్పుల‌ను స‌రిదిద్దే కార్య‌క్ర‌మం ఇంకా పూర్తి కాలేదు. ప్ర‌స్తుతం ఇంట‌ర్ ఆన్స‌ర్ షీట్ల రీ వెరిఫికేష‌న్‌, రీ వాల్యూయేష‌న్ చురుగ్గా జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మం పూర్తి అయ్యి... ఎవరి త‌ప్పు ఎంత అన్న‌ది తేల్చ‌కుండానే వ‌చ్చే ఏడాది విద్యా సంవ‌త్స‌రాన్ని ఎలా ప్రారంభిస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌ధానంగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌. అయితే జ‌నం నుంచి వినిపించే ప్ర‌శ్న‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లా లేని టీఆర్ఎస్ స‌ర్కారు... ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్ర‌ణాళిక ప్ర‌క‌టించినా కిమ్మ‌న‌కుండా ఉండిపోవ‌డం చూస్తుంటే... ప్ర‌భుత్వ అనుమ‌తితోనే బోర్డు ఈ ప్ర‌క‌ట‌న చేసింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ ప్ర‌శ్న‌ల‌కు ఎప్పుడు స‌మాధానాలు ల‌భిస్తాయో తెలియ‌దు గానీ... ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్ ప్ర‌క‌టించిన నెక్ట్స్ ఇయ‌ర్ షెడ్యూల్ ఇలా ఉంది. జూన్ 1 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యే ఇంట‌ర్ కోర్సుకు అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ఈ నెల 21 నుంచి మొద‌లైపోతుంది. ఇవి తొలి విడ‌త అడ్మిష‌న్లేన‌ట‌. సెకండ్ ఫేజ్ అడ్మిష‌న్ల‌కు త్వ‌ర‌లోనే తేదీలు ప్ర‌క‌టిస్తార‌ట‌. ఇదిలా ఉంటే... ప్రైవేట్‌, కార్పొరేట్ క‌ళాశాల‌ల‌ను క‌ట్ట‌డి చేసే విష‌యంపైనా ఈ షెడ్యూల్ లో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. సెక్ష‌న్ కు 88 మంది పిల్ల‌ల కంటే మించితే ఆ కాలేజీల‌పై క‌ఠిన చ‌ర్య‌లే తీసుకుంటార‌ట‌. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో వివాదం రేకెత్తితే... దానిపై కించిత్ అప‌రాధ భావ‌న కూడా లేకుండా ప్రారంభ‌మైపోతున్న ఇంట‌ర్ బోర్డు షెడ్యూల్ కు ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.