Begin typing your search above and press return to search.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

By:  Tupaki Desk   |   29 April 2019 8:56 AM GMT
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
X
ఇంటర్మీడియట్ అనే పదం వింటేనే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వణికిపోతుంది. లోక్ సభ ఎన్నికలు సజావుగానే పూర్తయినా.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. ఇంటర్మీడియట్ వ్యవహారం ప్రభాత్వానికి పెద్ద మైనస్ గా మారింది. ప్రతిపక్షాలతో పాటు విద్యాసంఘాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు సైలెంట్ అయిపోయిన ప్రతిపక్షాలకు ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారంతో అనవసరంగా ప్రభుత్వమే ఆయుధం ఇచ్చినట్లు అయ్యింది. దీంతో.. దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం.. రీ కౌంటింగ్ రీ వేల్యూయేషన్ లు ఉచితంగా చేసుకోవచ్చుని ప్రకటించింది.

అంతేకాకుండా ఇంటర్మీడియట్ మార్కులు వ్యవహారం ఏదో ఒకటి తేలేవరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోమని ప్రకటించింది. మే 16 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాయిదా వేసింది. మే 25 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 4 వరకు కొనసాగుతాయి. జూన్ 7 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాత్కాలిక టైమ్ టేబుల్‌ను ఆదివారం విడుదల చేసింది.

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆందోళనను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగాడు. ఎన్నికల వేళ ప్రతిపక్షం యాక్టివ్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అధికార పక్షం.. విద్యార్థులకు ఎంత వీలైతే అంత ఫేవర్ చేసేందుకు సిద్ధమైంది. అందుకోసమే సప్లిమెంటరీ పరీక్షల్ని వాయిదా వేసింది. ప్రస్తుతం రీవెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. రీవెరిఫికేషన్ ఫలితాల వెల్లడికి సుమారు పదిహేను రోజులు పట్టే అవకాశమున్నందున సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసింది.