Begin typing your search above and press return to search.

ఒక్క‌రోజే..కేసీఆర్‌కు మూడు షాకులిచ్చిన హైకోర్టు

By:  Tupaki Desk   |   24 Nov 2017 3:27 PM GMT
ఒక్క‌రోజే..కేసీఆర్‌కు మూడు షాకులిచ్చిన హైకోర్టు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ర్కారుకు మామూలు షాక్ కాదు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు తీర్పులు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. అందులో మూడు ముఖ్య‌మైనవే కావ‌డం విశేషం. రెండు కేసులు అయితే...తెలంగాణ ఉద్య‌మంలో త‌న వెన్నంటి న‌డిచిన కీల‌క శ‌క్తులు - వ్య‌క్తుల‌కు చెందినవి కావ‌డం గ‌మ‌నార్హం. శుక్ర‌వారం హైకోర్టులో వ‌చ్చిన మూడు తీర్పుల విష‌యానికి వ‌స్తే ఒక‌టి...తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంటికింద రాయిలా మారిన జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఉదంతం. రెండోది తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఇటీవ‌లి కాలంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులు..మూడోది...కేసీఆర్‌ను చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా భావించే రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన స‌న్ బ‌ర్న్ షో.

దాదాపుగా ఆరు ల‌క్ష‌ల మంది యువ‌త పోటీ ప‌డుతున్న ఉపాధ్యాయ కొలువుల భ‌ర్తీలో మెజార్టీ అభ్య‌ర్థుల ఆకాంక్ష‌లకు విరుద్ధంగా ఉమ్మ‌డి ప‌దిజిల్లాల‌కు కాకుండా..31 జిల్లాల ప్ర‌కారం భ‌ర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీ ద్వారా తెలంగాణ స‌ర్కారు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విద్యార్థి లోకం భ‌గ్గుమంది. రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌గా...టీఆర్టీ నోటిఫికేషన్ కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. టీ ఆర్టీ పై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రక్రియను వచ్చే నెల 15 వరకూ పొడిగించాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. జీవో 25ను సవరించి తీరాల్సిందేనని హైకోర్టు ఈ రోజు విస్పష్ట తీర్పు నిచ్చింది. పది జిల్లాల ప్రాతిపదికనే టీఆర్టీ నోటిఫికేషన్ ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇది స‌ర్కారుకు పెద్ద దెబ్బ‌గా భావిస్తున్నారు. దాదాపు మెజార్టీ విద్యార్థులు ఈ తీర్పుతో హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంకు సంబంధించిన కొలువుల కొట్లాట విష‌యంలో కీల‌క తీర్పునిచ్చింది. కొలువులకై కొట్లాట సభకు అనుమతినివ్వాలన్న వాజ్యంపై హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈనెల 30, డిసెంబరు 1 - 6 తేదీల్లో కాకుండా మిగతా రోజుల్లో సభ జరుపుకోవచ్చని హైకోర్టు సూచించింది. పోలీసులకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని ఐకాసకు సూచించింది. దరఖాస్తు అందిన 40 గంటల్లో అనుమతినివ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుపై జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం హ‌ర్షం వ్యక్తం చేశారు.

కాగా, గ‌చ్చిబౌలి స్టేడియంలో జ‌ర‌గ‌నున్న స‌న్ బ‌ర్న్ పార్టీకి మైన‌ర్లను అనుమ‌తి ఇచ్చార‌ని హైకోర్టును ఆశ్రయించిన ఉదంతంలో న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీకి అనుమ‌తి కోరుతూ హైకోర్టులో వేసిన పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు పార్టీ చేసుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చిన‌ప్పుడు నిబంద‌న‌లు ప‌ట్టించుకోరా అని నిల‌దీసింది. అనుమ‌తి ఇస్తూనే ష‌ర‌తులు విధించింది. పార్టీ మొత్తాన్ని రికార్డు చేయాల‌ని ఎక్సైజ్ - లా అండ్ ఆర్డ‌ర్ పోలీసుల‌కు హైకోర్టు ఆదేశించింది. 30లోగా వీడియో రికార్డుల‌ను స‌మ‌ర్పించాల‌న్న హైకోర్టు ..తుదిప‌రి విచార‌ణ 30కి వాయిదా వేసింది.