Begin typing your search above and press return to search.

స్ట్రాంగ్ రూం సీల్ పగలగొట్టండి.. జగిత్యాల కలెక్టర్ కు హైకోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   20 April 2023 10:00 AM GMT
స్ట్రాంగ్ రూం సీల్ పగలగొట్టండి.. జగిత్యాల కలెక్టర్ కు హైకోర్టు ఆదేశం
X
తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. కొంతకాలంగా నడుస్తున్న వివాదానికి సంబంధించి తాజాగా స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల వివాదానికి సంబంధించి.. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం సీల్ ను పగలగొట్టాలంటూ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై తాజాగా చేసిన ఆదేశాలు ఆసక్తికరంగామారాయి. తదనంతర పరిస్థితులపై ఉత్కంట చోటు చేసుకుంది.

ఇంతకూ అసలీ వివాదం ఏమిటి? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న కొప్పుల ఈశ్వర్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అభ్యర్థిగా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఆయన గెలిచినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆయన ఎన్నిక అక్రమమంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.

ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని.. రీకౌంటింగ్ కోసం ఆయన కోర్టును కోరగా.. దీనిపై విచారణ చేపట్టింది. సదరు ఎన్నికల్లో 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్ లో చోటుచేసుకున్న అవకతవకల కారణంగా తానుఓడినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన సందర్భంగా స్ట్రాంగ్ రూం తెరవాలని కోర్టు పేర్కొంది. అయితే.. ఏప్రిల్ 10న ఈ పని చేసేందుకు వెళ్లిన జిల్లా కలెక్టరర్ షేక్ యాస్మిన్ భాషాకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తాళం మిస్ అయినట్లుగా గుర్తించారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు జిల్లా కలెక్టర్ రిపోర్టు ఇవ్వగా..

తాజాగా మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాల్నిజారీ చేసింది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం సీల్ ను పగలగొట్టాలని.. తలుపులు తెరవాలని ఆదేశించింది. అయితే.. ఈ పనిని అన్ని పార్టీల సమక్షంలోనే చేపట్టాలని పేర్కొంది. అవసరమైతే వడ్రంగి... లాక్ స్మిత్ సహకారం తీసుకునేందుకు అనుమతిని జారీ చేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. రీకౌంటింగ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.