Begin typing your search above and press return to search.

హైకోర్టులో మంత్రి కేటీఆర్ కి ఊరట ...రేవంత్‌ కి చుక్కెదురు !

By:  Tupaki Desk   |   10 Jun 2020 11:50 AM GMT
హైకోర్టులో మంత్రి కేటీఆర్ కి ఊరట ...రేవంత్‌ కి చుక్కెదురు !
X
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్ ‌హౌస్ ‌పై వివరణ ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యులనల్ (NGT) ఇచ్చిన నోటీసులపై కేటీఆర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆయన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన హైకోర్టు..జాతీయ హరిత ట్రిబ్యులన్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. కాగా, జన్వాడలోని ఫామ్ హౌస్‌ పై కొంతకాలంగా ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు.

దీనిపై ఎన్టీజీ లోనూ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన ఎన్టీజీ పిటిషన్ ‌లోని అంశాల ఆధారంగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీజీ ఉత్తర్వులపై మంత్రి కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వివాదస్పద ఫామ్ హౌస్‌ తనది కాదని స్పష్టం చేస్తూ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.

అంతకుముందు ఎన్జీటీ జారీ చేసిన నోటీసులపై మంత్రి కేటీఆర్‌ ఆసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకందని, అది రాజకీయ కక్షపూరిత పిటిషన్‌ అని ఆయన ఆరోపించారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వులు జారీచేసిందని విమర్శలు గుప్పించారు. కాగా , ప్రస్తుతం ఈ ఫాంహౌజ్ వ్యవహారంలోనే ప్రస్తుతం అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.