Begin typing your search above and press return to search.

ఆ అధికారులపై టీ హైకోర్టు సీరియస్.. మొక్కుబడి క్షమాపణల్ని ఆమోదించం

By:  Tupaki Desk   |   18 March 2021 9:30 AM GMT
ఆ అధికారులపై టీ హైకోర్టు సీరియస్.. మొక్కుబడి క్షమాపణల్ని ఆమోదించం
X
అనవసరమైన వివాదాల్ని నెత్తి మీద వేసుకోవటం అంటే ఇదేనేమో? ఒక ఇష్యూలో తప్పు జరిగినప్పుడు.. దాన్ని అక్కడితే ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది. అంతే తప్పించి.. చింపి చేట చేసుకున్న తీరుతో వ్యవహరించటం వల్ల లాభం తర్వాత భారీ నష్టానికి కారణం కావటమే కాదు.. అనవసరమైన వివాదంలోకి జారిపోయినట్లే. ఈ చిన్న విషయం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి కలెక్టర్ కు.. అక్కడి రెవెన్యూ అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదన్నది ప్రశ్న.

ఇప్పటికే కోర్టు ధిక్కరణకు పాల్పడి.. అందులో శిక్ష పడిన వేళలో.. వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై తాజాగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. మొక్కుబడి క్షమాపణలతో అప్పీలు దాఖలు చేస్తే అనుమతించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఇంతకూ జరిగిందేమంటే.. సంగారెడ్డి జిల్లా కంది - చిమ్నాపూర్ గ్రామంలో కొనుగోలు చేసిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకపోవటంతో డేవిడ్ తదితరులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి అదనపు కలెక్టర్ వీరారెడ్డి.. ఆర్డీవో శ్రీను.. తహసీల్దార్ ఉమాదేవి లకు రెండు నెలల జైలు.. రూ.2వేల ఫైన్ వేస్తూ తీర్పును ఇచ్చారు. ఖర్చుల కింద రూ.25వేలు చెల్లించాలన్నారు. దీన్ని సవాలు చేసిన అధికారులు.. వారి తరఫున దాఖలు చేసిన అప్పీళ్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

కోర్టు ఉత్తర్వులను అధికారులు గౌరవించకపోవటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంటూ.. కోర్టు ధిక్కరణను సమర్థించుకుంటూ చెప్పాల్సిన కారణాల్ని చెబుతూనే.. తిరిగి మొక్కుబడిగా క్షమాపణలు చెబితే వాటిని అంగీకరించమని చెప్పింది. ఎన్ని కోర్టు ధిక్కరణ కేసుల్ని ఎదుర్కొంటున్నారో చెప్పాలని పేర్కొంది. జరిగిన తప్పునకు లెంపేసుకొని.. మరోసారి జరగదని చెప్పటం లాంటివి ‘తెలివి’తో కొత్త తిప్పలు తెచ్చుకున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ ఏడుకు వాయిదా పడింది.