Begin typing your search above and press return to search.

సరోగసీ వ్యాపారమే.. పన్ను మినహాయింపా? హైకోర్టు సూటిప్రశ్న

By:  Tupaki Desk   |   14 Jun 2023 10:00 PM GMT
సరోగసీ వ్యాపారమే.. పన్ను మినహాయింపా? హైకోర్టు సూటిప్రశ్న
X
'సరోగోసీ' సేవ ఏ మాత్రం కాదంటూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అద్దెగర్భంతో పిల్లల్ని పుట్టించేందుకు చేసుకునే ఒప్పందం పూర్తిగా వ్యాపార కోణమేనని స్పష్టం చేసిన కోర్టు.. దానికి పన్ను మినహాయింపులు ఏమిటి? అని ప్రశ్నించింది. సరగోసి పద్దతిలో పిల్లలు పుట్టే అంశం మూడు పార్టీలమధ్య జరిగే ఒప్పందమన్న విషయాన్ని గుర్తు చేసింది.

పిల్లలు లేని వారికి ఈ పద్దతిలో సేవ చేస్తున్నామని చెప్పటం సమంజసం కాదన్న కోర్టు.. ఇది తప్పకుండానే వ్యాపార ప్రక్రియేనని స్పష్టం చేసింది. పన్ను మినహాయింపులు ఎలా వర్తిస్తాయో చెప్పాలని పేర్కొంది.

సరోగసీకి పన్ను విధించటాన్ని సమర్థిస్తూ ఆదాయపన్ను ట్రైబ్యునల్ 2021లో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ.. హైదరాబాద్ కు చెందిన కిరణ్ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిల్లలు లేని వారు సంతానాన్ని పొందే అవకాశాన్ని సరోగసీ ప్రక్రియ కల్పిస్తుందన్నారు. పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులు చెల్లించే డబ్బులు.. అద్దె గర్భం ఇచ్చే తల్లికి చెల్లిస్తామన్నారు.

దీనికి స్పందించిన న్యాయస్థానం.. సరోగసీ దాతృత్వం కోసం చేసే పని అయితే డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు? గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళకు చేసే వైద్య పరీక్షలకు, మెడిసిన్స్ ఆసుపత్రి వారు ఛార్జీలు విధిస్తారు కదా? ఒకసారి అద్దె గర్భానికి ఒప్పుకొన్న మహిళ మరోసారి కూడా ఒప్పుకొనే అవకాశం ఉంది.

ఇలా వారు ఒకరి కంటే ఎక్కువ మందికి జన్మనిస్తారు. దీన్ని బిజినెస్ కాక ఇంకేమంటారు? తల్లిదండ్రులు కావాలనుకునే వారికి, గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళకు, ఆసుపత్రికి మధ్య కుదిరిన ట్రైపార్టీ ఒప్పందమిది. అందుకే పన్ను విధిస్తున్నారు'' అంటూ ఆదాయపు పన్ను ట్రైబ్యునల్‌ వాదనను సమర్థించింది. దీనికి పన్ను మినహాయింపు ఏరకంగా వర్తిస్తుందో చెప్పాలని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను జులై 24కు వాయిదా వేసింది.