Begin typing your search above and press return to search.

కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

By:  Tupaki Desk   |   1 July 2020 11:50 AM GMT
కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
X
కరోనా పరీక్షలను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలనే తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని.. అమలు కావడం లేదని సీరియస్ అయ్యింది. ఈ నెల 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయకపోతే ఈనెల 20న సీఎస్, వైద్యారోగ్య, మున్సిపల్ ముఖ్యకార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్ లో అరకొర సమాచారం పై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులెటిన్ లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడం లేదని వ్యాఖ్యానించింది. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన రాజ్యాంగ పరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న హైకోర్టు.. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది.

రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో తెలపాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు తెలపాలని కోరింది. కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను సమర్పించాలంది.

ఈనెల 17లోగా తమ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు అల్టీమేటం జారీ చేసింది. ఒకవేళ అమలు కాకపోతే ఈనెల 20న సీఎస్‌, వైద్యారోగ్య, మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైకోర్టుకు హాజరుకావాలని ఆదేశం.