Begin typing your search above and press return to search.

వక్ఫ్‌బోర్డు సీఈవో పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ... సీఆర్‌పీసీ గురించి తెలియదట !

By:  Tupaki Desk   |   17 Nov 2020 10:50 AM GMT
వక్ఫ్‌బోర్డు సీఈవో పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ... సీఆర్‌పీసీ గురించి తెలియదట !
X
వక్ఫ్‌ బోర్డు సీఈవో మహ్మద్‌ ఖాసీం పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థకి చెందిన ఆస్తులు ఆక్రమణకు గురౌతున్నా , చర్యలు తీసుకోని సీఈవో అవసరమా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ముస్లిం శ్మశాన వాటికల్లో 86 మంది స్థలాలను ఆక్రమించినట్లు గుర్తిస్తే కేవలం ఐదుగురిపైనే ఎఫ్ ‌ఐఆర్‌ నమోదు చేసి మిగిలిన వారిని ఎందుకు వదిలేశారని నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకోమని వారు చెబితే ఊరుకుంటారా అని ప్రశ్నించింది. వక్ఫ్‌ ఆస్తులను కాపాడటంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఈవోకి స్వస్తి చెప్పాలని ఘాటుగా స్పందించింది. సీఈవోపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ వెల్ఫేర్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జంటనగరాలలోని ముస్లింల శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా వక్ఫ్‌బోర్డు చర్యలు చేపట్టడం లేదని నగరానికి చెందిన సామాజిక కార్యకర్త మహ్మద్‌ ఇలియాస్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కోర్టు విచారణ చేపట్టింది. స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరిస్తే.. జిల్లా ఎస్పీల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీసింది. పోలీసులు కేసు నమోదు చేయకపోతే.. మెజిస్ర్టేట్‌ కోర్టులో ప్రైవేటుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. వక్ఫ్ ‌బోర్డు తరపు న్యాయవాది వివరణ ఇస్తూ.. సీఈవోకు ఆక్రమణలను తొలగించే అధికారాలు లేవని, వక్ఫ్‌ బోర్డులో తగినంత సిబ్బంది లేరని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టుల్లో కూడా తగిన సిబ్బంది, జడ్జీలు లేరు. అంత మాత్రాన కోర్టులు పనిచేయడం మానేశాయా అని ప్రశ్నించింది.

తనకు సీఆర్ ‌పీసీ గురించి తెలియదని కాసీం అనడంపై ధర్మాసనం స్పందిస్తూ ఇంత చేతగానీ సీఈవో ఉంటే వక్ఫ్‌బోర్డు ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. అక్రమణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, 18 ఏళ్లు గడిచినా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అక్రమార్కులపై వెంటనే చట్టపరంగా తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. మూడు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. వక్ఫ్‌ ఆస్తులు కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఈవోపై ఏం చర్యలు తీసుకున్నారో తదుపరి విచారణలో చెప్పాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 17కి వాయిదా వేసింది.